Remove Mahatma Gandhi's face: Union Home Ministry
mictv telugu

మ‌హాత్మా గాంధీ ముఖాన్ని తీసేయండి: కేంద్ర హోం శాఖ

October 3, 2022

మ‌హాత్మా గాంధీని మహిషాసురుడుగా చూపించడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వెంటనే దుర్గామాత కాళ్ల కింద ఉన్న మ‌హిషాసురుడికి గాంధీ ముఖాన్ని తీసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో అప్రమత్తమైన అధికారులు మండపానికి చేరుకొని, గాంధీ ముఖాన్ని మార్చివేశారు.

వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో తాజాగా అఖిల భారత హిందూ మహాసభ ఆధ్వర్యంలో దుర్గా పూజ నిర్వహించారు. ఆ పూజ కార్యక్రమంలో మ‌హాత్మా గాంధీని మహిషాసురుడుగా చూపించారు. అంతేకాదు, ఓ మండపంలో దుర్గామాత కాళ్ల కింద ఉన్న మ‌హిషాసురుడికి గాంధీ ముఖాన్ని పెట్టారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పలువురు ఫిర్యాదు చేశారు. దాంతో కేంద్రం హోం మంత్రిత్వ శాఖ ఆగ్రహించింది. వెంటనే పూజ నిర్వాహకులు గాంధీ ముఖాన్ని మార్చి, అమ్మవారి ముఖాన్ని అమర్చాలని ఆదేశాలు ఇచ్చింది. అనంతరం పోలీసుల సూచనల మేరకు విగ్రహం రూపు రేఖలు మార్చారు.

ఈ ఘటనపై అఖిల భార‌త‌ హిందూ మహాసభ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రచూర్ గోస్వామి మాట్లాడుతూ.. “మేము గాంధీని నిజమైన అసురుడిగా చూస్తాము. అయ‌నే నిజమైన అసురుడు. అందుకే మేము దేవ‌తా మూర్తిని ఇలా తయారు చేశాము. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీని ప్రమోట్ చేస్తోంది. మేము బలవంతంగా మూర్తిని తొలగించి దానిని మార్చాము. హోం మంత్రిత్వ శాఖ మాపై ఒత్తిడి తెచ్చింది. గాంధీని అన్ని చోట్ల నుంచి తొలగించి, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఇతర స్వాతంత్ర్య సమరయోధులను ముందు ఉంచాలనుకుంటున్నాము” అని ఆయన అన్నారు.