కులం నుంచి వెలివేశారు.. చుక్కారామయ్యతో ముచ్చట.. వీడియో
ఆంధ్ర మహాసభల నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమాల వరకు ఆయనది కీలక పాత్ర. వెట్టిచాకిరీ, కుల వివక్షలను ఆయన దీటుగా ఎదుర్కొన్నారు. ఉద్యమకారుడిగా రజాకార్లను వ్యతిరేకించారు. నిజాం నిరంకుశ పాలనపై తిరగబడ్డారు. జైలుకూ వెళ్లారు. కుల వివక్షపై మాట్లాడినందుకు కులం నుంచి తీసేశారు.. మాదిగ ఇళ్లల్లో తిన్నారు.. మంచినీళ్లు తాగారు. ఎన్నో అవమానాలు పడ్డారు. తాను ఐఐటీ చదవకపోయినా ఐఐటీ రామయ్యగా ఫేమస్ అయ్యారు. ఎందరికో విద్యాదానం చేశారు. ఆయన అసలు పేరు చుక్కా రామయ్య. నల్లగొండ జిల్లాలోని కుగ్రామం గూడూరులో జన్మించారు. తల్లి ప్రోద్బలంతో ఆయన ఉన్నత విద్యను అభ్యసించారు. ఇలాంటివెన్నో మనకు తెలియని విషయాలను ఆయన ‘మీట్ ద లెజెండ్’ కార్యక్రమంలో పంచుకున్నారు.
1946లో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన ప్రజారంగంలో పనిచేస్తున్నారు. నిజాం ప్రభుత్వం ఆయనపై రెండు కేసులు పెట్టింది. సంవత్సరం పాటు జైలు జీవితం గడిపారు. ప్రజారంగంలో వుండాలంటే ప్రజలను చదవాలని ఆయన అక్కడే తెలుసుకున్నారు. బ్రాహ్మణ సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన రామయ్య పీడిత ప్రజల పాలిట నిలబడాలనే తపన కలిగింది. ఐఐటీ ఆయన చదవలేదు కానీ వాళ్ల అమ్మాయిని ఐఐటీ చదివించారు. 15 ఏళ్లు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్‌గా పనిచేసి రిటైరైన తర్వాత చదువులు చెప్పడానికి పూనుకున్నారు. ముల్కీ, నాన్ ముల్కీ, ఆంధ్రమహాసభలు, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, తొలిదశ తెలంగాణ ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం.., వంటి పరిణామాలకు ఆయన ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు. ఆ విద్యావేత్త, ఉద్యమకారుడు డాక్టర్ చుక్కా రామయ్య వెల్లడించిన అనేక విషయాలు తెలియాలంటే పై లింకులో చూడగలరు.