రేణుకు లగ్జరీ బంగ్లా కొనిచ్చిన పవన్! మాజీ భార్య స్పందన ఇదీ! - MicTv.in - Telugu News
mictv telugu

రేణుకు లగ్జరీ బంగ్లా కొనిచ్చిన పవన్! మాజీ భార్య స్పందన ఇదీ!

February 14, 2020

Renu desai clarity about pawan kalyan gift .

ప్రముఖ నటి రేణు దేశాయ్‌కి ఆమె మాజీ భర్త జనసేనాని పవన్ కళ్యాణ్ ఖరీదైన ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఈ వార్తలు రాసుకొచ్చాయి. తన ఇద్దరు పిల్లలు ఆద్య, అకీరాల కోసం హైదరాబాద్‌లో ఇల్లు కొనిచ్చినట్టు వార్తల్లో రాశారు. 

 

ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలతో పుణేలో ఉంటున్న రేణు దేశాయ్.. పవన్ కొనిచ్చిన ఇంటికి మారనున్నారని వార్తల్లో తెలిపారు. అయితే, ఈ వార్తలపై రేణు దేశాయ్ ఘాటుగా స్పందించారు. ఈ వార్తలను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి తప్పడు వార్తలు తనపై ఎందుకు సృష్టిస్తున్నారో అర్థం కావడం ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో తన కష్టార్జితంతో ఇల్లు కొనుక్కున్నానని వెల్లడించారు. ఈ మేరకు రేణు దేశాయ్ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ పెట్టారు.

 

రేణు దేశాయ్ ఫేస్‌బుక్ పోస్ట్

 

”నేను ఇప్పుడు మీ అందరికీ ఈ విషయం గురించి వివరణ ఇవ్వడానికి ఒకే ఒక్క కారణం, నిన్నటి నుండి నాకు మీడియా వాళ్ళ నుండి, స్నేహితుల నుండి వస్తున్న ఎన్నో మెసేజెస్, ఫోన్ కాల్స్ ఆధారంగా నాకు ఈ విషయం చాలా సీరియస్ అయింది అని అర్థమయ్యింది. వాళ్ళు చెప్పింది విని నాకు చాలా బాధ వేసింది అందుకే ఈ వివరణ…

 

ఒక వ్యక్తి నిజమైన ఆస్తి తన ఆత్మగౌరవం…

ఒక వ్యక్తి నిజమైన ఆస్తి తన నిజాయితీ…

ఒక వ్యక్తి నిజమైన ఆస్తి తన అస్తిత్వం…

ఇది మీకు తెలియనిదా??!!

 

నేను, నా జీవిత మనుగడ కోసం ఒంటరిగా, తీవ్రంగా, నిబద్దతతో ఎంతగానో శ్రమిస్తున్నాను… శ్రమిస్తూనే పోరాడుతున్నాను…

 

నేనిప్పటివరకూ కనీసం మా తండ్రి గారి దగ్గర్నుంచి కూడా ఏ రకమైన ఆర్థిక సహాయం ఆశించలేదు, పొందలేదు…

అలాగే, నేనిప్పటివరకూ నా మాజీ భర్త దగ్గర్నుంచికూడా ఎలాంటి అన్యాయపూరితమైన భరణాన్నీ ఆశించలేదు, పొందలేదు…

 

అది నా వ్యక్తిత్వం!!!

 

అయినప్పటికీ మీరు నా గురించి అన్యాయంగా, అసంబద్దమైన అబద్దపు వార్తలను ప్రచారం చేస్తూనే ఉన్నారు!

 

మీరందరూ అనుకుంటున్నట్టూ, ప్రచారం చేస్తున్నట్టూ ఇప్పుడు హైదరాబాద్‌లో నేను కొన్న ఫ్లాట్ నిజంగా మాకెవరూ కొనివ్వలేదు. అది నా కష్టార్జితంతో ఒక్కో రూపాయి కూడబెట్టుకుని కొనుక్కున్న నా సొంత ఇల్లు…

 

అది నా మాజీ భర్త మాకు కొనిచ్చారన్న ఇలాంటి అసత్య ప్రచారాల వల్ల నా నిజాయితీకీ, ఆత్మగౌరవానికీ, నా అస్థిత్వానికీ, చివరగా నా ఉనికికే ప్రమాదం సంభవిస్తుందనే చిన్న ఆలోచన మీకెవ్వరికీ రాలేదా???

 

నాకు తెలిసినంతవరకూ, ఈ వార్తకూ నా మాజీ భర్తకూ ఎలాంటి సంబంధం ఉండి ఉండదు… కనీసం ఈ ప్రచారం ఆయన దృష్టికి కూడా వెళ్ళి ఉండదు…

 

అలాంటిది, ఒక వార్తను రాసేటప్పుడు, అది నిజమో కాదో నిర్ధారించుకోకుండానే, అత్యుత్సాహంతోనో, తొందరపాటుతోనో, లేక మీ సంస్థల మనుగడకోసమో, ఒక ఒంటరి స్త్రీ మనుగడను ప్రమాదంలో నెట్టడం ఎంతవరకూ సమంజసం???

 

ఇలాంటి వార్తలు ఎంత వేగంగా ప్రజల్లోకి వెళ్తాయో మీకు తెలియదా??

ప్రజలు ఈ అబద్దపు వార్తను నిజమని నమ్మితే, సంఘంలో నాకున్న గౌరవం మసకబారదా??

ఏది జరిగినా చెక్కు చెదరని నా అస్థిత్వం, వ్యక్తిత్వం, నా ఆత్మగౌరవం, నేను అనే ఒక నిజం అసత్యం అయిపోదా??

 

నా ఆత్మ ఎంత ఘోషిస్తుంది!! ఎంతలా చితికిపోతుంది!!?

దయచేసి ఆలోచించండి…

 

నా ఈ జీవితంలో ఇప్పటివరకూ ఏ మగవాడి సాయం లేకుండా సాగుతున్న నాలాంటి ఒంటరి తల్లి జీవన గమనానికీ, పోరాటానికి గౌరవం ఇవ్వకపోయినా సరే…

దయచేసి, ఇలా కించపరచకండి…

 

నేను మీతో పంచుకుంటున్న ఈ బాధను సరిగ్గా అర్థం చేసుకోకుండా మళ్ళీ నాకూ, నా మాజీ భర్త అభిమానులకూ మధ్య, దయచేసి ఎలాంటి గొడవలూ సృష్టించకండి…

 

మీ

రేణూ దేశాయ్”