రేణుకాచౌదరి శూర్పనఖ.. మోదీ అందాల రాముడు! - MicTv.in - Telugu News
mictv telugu

రేణుకాచౌదరి శూర్పనఖ.. మోదీ అందాల రాముడు!

February 8, 2018

రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి వెటకారపు నవ్వు, ప్రధాని నరేంద్ర మోదీ ఘాటు కౌంటర్లపై సోషల్ మీడియా సటైర్లు పేలుతున్నాయి. రేణుకా చౌదరి రామాయణంలో మాదిరి నవ్విందని మోదీ అనడం తెలిసిందే. అయితే రామాయణంలో ఆమె పాత్ర ఏంటో అర్థంకాక జనం జట్టుపీక్కున్నారు. కేంద్ర మంత్రి కిరెన్ రిజుజు.. ఆమెది శూర్పనఖ పాత్ర అని తేల్చేస్తూ ఫేస్ బుక్‌లో శూర్పనఖ నవ్వుతున్న రామాయణం సీరియల్ లోని వీడియోను పోస్ట్ చేశారు. దీంతో రచ్చ రచ్చ అయిపోతోంది.

బుధవారం రాజ్యసభలో ప్రధాని మాట్లాడుతూ.. ‘వాజ్‌పేయి హయాంలో ఆధార్‌ కార్డుకు బీజం పడింది’ అని చెప్పుకొచ్చారు. దీంతో రేణుకా చౌదరి విరగబడి నవ్వారు. చాలాసేపు నవ్వు ఆపుకోలేకపోయారు. దీంతో సభలోని వారంతా ఆమెవైపుకు తిరిగి చూశారు. అయినా ఘెల్లుమని నవ్వుతూనే ఉండిపోయారు. అమర్యాదకరంగా ఆ నవ్వేంటని సభాపతి వెంకయ్యనాయుడు మందలించారు.రేణుక నవ్వు మోదీకి తీవ్ర ఆగ్రహం కలిగించింది. ‘సభాపతీజీ… రేణుకను అడ్డుకోకండి. రామాయణం టీవీ సీరియల్‌ తర్వాత అంతటి నవ్వును వినే భాగ్యం మనకు ఈ రోజే దక్కింది..’ అని అన్నారు. దీంతో మళ్లీ నవ్వులే నవ్వులు. అయితే మోదీ.. రేణుకను రామాయణంలో ఎవరితో పోల్చారో అర్థం కాలేదు. కొందరైతే మోదీ పొరబడ్డారని, ఆమె నవ్వును ద్రౌపది నవ్వు అనుకున్నారని భావించారు. దీనిపై విలేకర్లను రేణుకనే అడిగారు. ‘ప్రధాని మాటపై నో కామెంట్.. ఎందుకంటే ఆయన ఓ మహిళ ఔన్నత్యాన్ని దిగజార్చాడు’ అని అన్నారు.

అయితే సోషల్ మీడియాలో మాత్రం రేణుక శూర్పనఖ అని బీజేపీ, హిందూ సంస్థలు గేలిచేస్తున్నాయి. కాంగ్రెస్ వారు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు.. ‘మరి మోదీ అందాలల రాముడా? ఆయనకు అంతసీన్ లేదు. ఒకపక్క భార్య రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంటే కనీసం ఫోన్లో కూడా పరామర్శించని భర్త ఆయన.. మళ్లీ ఆడవాళ్లపై సటైర్లు వేస్తున్నారు..’ అని మండిపడుతున్నారు. మోదీ అలా అనుకండా.. ఆధార్‌కు వాజ్‌పేయి ఎలా బీజం వేశారో వివరించి ఉంటే హుందాగా ఉండేదని చెబుతున్నారు. మరోపక్క.. తనను శూర్పనఖతో పోల్చిన మంత్రి రిజుజుపై సభాహక్కుల నోటీసు తెస్తానని రేణుక హెచ్చరించారు.