జర గుంతల్ని పూడ్చేయండి సార్లూ..వచ్చేది వర్షాకాలం... - MicTv.in - Telugu News
mictv telugu

జర గుంతల్ని పూడ్చేయండి సార్లూ..వచ్చేది వర్షాకాలం…

June 5, 2017

హైదరాబాద్…బెస్ట్ లీవింగ్ సిటీ.. తెలంగాణ వాసులకు ఉపాధి అడ్డా..చదవులకు కేరాఫ్ అడ్రస్..ఇలా చెప్పుకుంటూ పోతే కళ్లముందే విశ్వనగరం కనిపిస్తుంది.కానీ రోడ్లు చూస్తే అన్ని గుంతలే. అంతా ప్యాచ్ వర్కులే. గల్లీ రోడ్లైయితే మరీ గలీజు. గుంతల రోడ్ల మీద కంకర పోసి…కాంట్రాక్టర్లు పనికానిచ్చేస్తున్నారు. కిందమీద పడి వాహనాలు నడపుతున్నారే తప్ప.. ప్రభుత్వాన్ని పల్తెత్తు మాట అనరు..ఈ కాంట్రాక్టర్లు ఇంతే అనుకుంటూ వెళ్లారు ఇంతకాలం.మరి వచ్చేది వర్షాకాలం. ఇలాగే ఉంటే ఎంత మంది ప్రాణాలు పోవాలి..? ఎంతమంది కాళ్లు, చేతులు విరగ్గొట్టుకోవాలి..? నిద్రమత్తులో జోగుతోన్న జీహెచ్ ఎంసీ ఇప్పుడైనా మేల్కొదా..?.సమావేశాలు..సమీక్షలు…వాకింగ్ లు చెకింగ్ లు అంటూ ఇంకెంత కాలం గడుపుతారు..?జర గుంతల్ని పూడ్చేయండి సార్లూ..వచ్చేది వర్షాకాలం.ఎంత మన స్వయంపాలనైనా…చెప్పకుండా ఉండలేం కదా…
నెలరోజుల్లో గుంతలు పూడ్చేయాలి. లేదంటే కఠిన చర్యలు ఉంటాయి. వచ్చేది వర్షాకాలం జర..సోయి ఉండాలి.. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన ఆర్డర్. నెలరోజులు అయింది. ఒక్క రోడ్డు బాగు పడలేదు..గుంతలు అలాగే ఉన్నాయి. కొన్నిచోట్ల కాంట్రాక్టర్లు కంకర పోసి గుంతల్ని మాయం చేశారు. మరికొన్ని చోట్ల మట్టిపోసి కవర్ చేశారు. మంత్రులు , ప్రభుత్వ ఉన్నతాధికారులు తిరిగే మార్గాల్లో ప్యాచ్ వర్కులతో కానిచ్చేశారు. వచ్చేది వానకాలమే..రోడ్లు వేసినా కొట్టుకుపోతాయని అనుకున్నారేమో కాంట్రాక్టర్లు.. ఎక్కడి గుంతల్ని అక్కడే..ఎక్కడ చెత్తరోడ్లని అక్కడే వదిలేశారు.
ఇన్నాళ్లూ మెట్రో రైలు ప్రాజెక్టు పనుల వల్ల రోడ్లను ఏం చేయలేమనిని చెబుతూ వచ్చారు. బాగు చేసినా మెట్రో రైలొచ్చి చిత్తు చిత్తు చేసింది అధికారులు చెప్పారు. సిటీజనులు అవును కాదా అనుకున్నారు. మియాపూర్ నుంచి ఎస్సార్ నగర్ దాకా దాదాపు మెట్రో పనులు అయిపోయాయి. పనులు అయిపోయి కూడా ఆర్నెళ్లు అవుతుంది. కానీ రోడ్ల పరిస్థితి అలాగే ఉంది. పది , ఇరవై అడుగులకో గుంత కనిపిస్తుంది. జేఎన్ టీ యూ దగ్గర మరీ దారుణంగా ఉంది. ఈ ఒక్క ప్రాంతమే కాదు..అన్నిరోడ్లు ఇలాగే ఏడ్చిచాయ్..అంటే అన్నారు.. అంటారు కానీ ఈ నరకదారులు కేసీఆర్ , కేటీఆర్ ఏలుబడిలో కూడా ఏంటో..?
మెయిన్ రోడ్లు అలా ఉంటే..కాలనీల రోడ్లు చెత్తగా ఉన్నాయి. అంతా గుంతలే..చూద్దామన్నా ఎక్కడా మంచి రోడ్ కనిపించదు. గరీబోళ్ల కాలనీలైతే ఇంకా దారుణం…పైపులైన్ల కోసం రోడ్లని తవ్వి వదిలేశారు. కనీసం జేసీబీలతో చదను చేసి అయినా వదిలెయ్యలేదు..గుంతలు మిట్టథలతో ఆ రోడ్లపై వెళ్లాలంటేనే వాహనదారులు వణుకుతున్నారు. పక్కాటెముకలు సైతం కదులుతుండటంతో పరేషాన్ అవుతున్నారు.
డర్టీ రోడ్స్ ,, సడెన్ బ్రేకులతో వాహనదారులకు షేకింగ్ లే కాదు షాకింగ్ లు తప్పడం లేదు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. మనఖర్మ ఇంతేనంటూ బైక్ రైడర్లు సర్దుకుపోతున్నారు. కొందరికి తీవ్రగాయాలైనా చెప్పులేకపోతున్నారు.
ఎల్బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు దగ్గర ఆదివారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. రహదారి నిర్మాణ పనుల కోసం తీసిన గుంతలో ద్విచక్రవాహనంతో సహా యువకులు పడిపోయారు. ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా గుంతలు రోడ్లు అక్కడే కాదు.. సిటీ మొత్తం ఉన్నాయి. వానలు రాకముందే పరిస్థితి ఇలా ఉంటే. వానలు దంచి కొడితే… సిటీ వాసులు ఏమైపోవాలి..? గుంతల రోడ్లు ఎంతమంది బలి కావాలి…?ఇక నైనా అధికారులూ మేల్కొనండి..కాంట్రాక్టర్లను తరుమండి..రోడ్లని బాగు చేయించండి. లేదంటే ఎంతో మంది బలి కావాల్సి వస్తుంది. బదనాం అయ్యాక…ప్రెస్ మీట్లు వెనకేసుకొచ్చినా ఫలితం ఉండదు..జాగో జీహెచ్ ఎంసీ..జాగో మేయర్ సాబూ…