శానిటైజర్ వాడితే క్యాన్సర్ వస్తుంది.. ప్రభుత్వం ఏమందంటే..
కరోనా సంక్షోభంలో ఎలాంటి పుకార్లను పుట్టించొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత మొత్తుకున్నా.. సోషల్ మీడియా ఉద్ధండులు ఊరుకుంటేగా. తప్పుడు కథనాలు పుట్టించి చాటింపేస్తున్నారు. ప్రజలు భయపడితే వారికదే పైశాచిక ఆనందం అన్నమాట. తాజాగా అలాంటిదే ఓ ఫేక్ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వరుసగా 50 నుంచి 60 రోజులు శానిటైజర్ వాడితే క్యాన్సర్ వస్తుందని ఓ న్యూస్‌పేపర్ క్లిపింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల్లో అది తెగ చెక్కర్లు కొడుతోంది. దీంతో ప్రజలు దానిని ఫార్వాడ్ చేస్తూనే తెగ భయాందోళనలకు గురవుతున్నారు.
అయితే దీనిపై స్పందించిన ఢిల్లీ ప్రభుత్వం తాజాగా ఓ ప్రకటన జారీ చేసింది. నిరంతరంగా హ్యాండ్ శానిటైజర్ వాడినంత మాత్రాన క్యాన్సర్ రాదని.. దీని వల్ల అటువంటి ప్రమాదమేదీ ఉండదని తెలిపింది. కరోనా కారణంగా శానిటైజర్ల వాడకం పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజల్లో ఆందోళన మరింత పెరగకుండా ఈ ప్రకటన చేసింది. ఇక కరోనా వైరస్ దరి చేరకుండా ఉండాలంటే వ్యక్తిగత శుభ్రత పాటించడం అత్యంత ముఖ్యమైందని తెలిసిందే. చేతులను 70 శాతం ఆల్కహాల్ ఉన్న శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవడం వల్ల కరోనా సోకదు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే అవాస్తవాలను నమ్మకపోవడమే మంచిదని ప్రభుత్వం పేర్కొంది.