దేశ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న రాష్ట్ర స్థాయిలో అధికారికంగా నిర్వహించాల్సి ఉన్న వేడుకలను ఈ ఏడాది కూడా రాజ్‌భవన్‌కు పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం రాత్రి రాజ్‌భవన్‌కు సమాచారాన్ని అందించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి, గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ గతేడాది లాగే ఈ సారి కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్‌భవన్‌లోనే జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారు.
గతేడాది కోవిడ్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వేడుకల నిర్వహణ విషయమై అప్పట్లో రాజ్ భవన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం జరిగింది. గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టిన గవర్నర్.. ప్రసంగం కూడా పంపలేదని పేర్కొన్నారు. అయితే కొవిడ్ ఉద్ధృతి కారణంగా రాజ్‌భవన్‌లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. తాజాగా ఈ ఏడాది కూడా రాజ్‌భవన్‌లోనే వేడుకలు జరగనున్నాయి.
తమిళిసై గవర్నర్ గా వచ్చిన మొదటి రెండేళ్లు పబ్లిక్ గార్డెన్స్ లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు కూడా. కానీ తర్వాత విభేదాలు వచ్చాయి. గత ఏడాది ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో గవర్నర్ రాజ్ భవన్ లోనే పతాకావిష్కణ చేయగా.. కేసీఆర్ ప్రగతి భవన్‌లోనే జెండా ఎగురవేశారు. ఈ ఏడాది కూడా అదే రిపీట్ కానుంది. గణతంత్ర వేడుకలపై ఇప్పటివరకు రాజ్‌భవన్‌కు ప్రభుత్వం సమాచారం ఇవ్వలేదు. దీంతో ఈ సారి కూడా రాజ్‌భవన్‌లోనే రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. ఉదయం జెండా ఆవిష్కరణ, సాయంత్రం ఎట్ హోమ్ నిర్వహిస్తారు.
సాధారణంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేళాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమవుతాయి. ఈ సారి కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. గతేడాది బడ్జెట్ సమావేశాలు, ఆ తర్వాత సెప్టెంబర్‌లో వారం పాటు సమావేశాలు, ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాగా ఫిబ్రవరి 3న మధ్యాహ్నం 12.10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. గవర్నర్ తో ప్రమేయం లేకుండా అసెంంబ్లీ జరుగుతోంది.