ఈ చెట్టును చూడాలంటే రిజర్వేషన్ ఉండాలి.. - MicTv.in - Telugu News
mictv telugu

ఈ చెట్టును చూడాలంటే రిజర్వేషన్ ఉండాలి..

February 16, 2021

tr

మనం కోరుకునే రోజున ప్రయాణ చేయాలంటే ముందుగా రిజర్వేషన్ చేయించుకోవాలి. బస్సుల్లో, రైళ్లలో, విమానాల్లో సీట్లును ముందే కొనుక్కోవాలి. సినిమాలు చూడ్డానికి కూడా రిజర్వేషన్ చేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ మాకు తెలుసులేవమ్మా, అసలు విషయమేంటో చెప్పు అని విసుక్కుంటున్నారా?
అయితే వినండి. ప్రపంచంలో ఓ వింత గురించి చెప్పుకుందాం. చెట్టును, పుట్టను, పిట్టలను చూడ్డానికి రిజర్వేషన్ అక్కర్లేదు కదా. కానీ ఓ చెట్టును చూడాలంటే మాత్రం మీరు తప్పకుండా రిజర్వేషన్ చేయించుకోవాలి. చైనాలోని షాంగ్జీ రాష్ట్రంలోని జోంగునాన్ కొండల్లో ఉందీ అరుదైన చెట్టు. గునియిన్ గమియవో అనే బౌద్ధ ఆలయంలో ఉన్న వృక్షరాజం గింకో జిలోబా అనే జాతికి చెందింది. దీని వయసు 1400 సంవత్సరాలు. ఈ భూమిలో దీనికంటే

వయసులో పెద్దవైన చెట్లు చాలానే ఉన్నాయి. అయితే అందచందాలో విషయంలో ఈ చెట్టు తర్వాతే ఏ చెట్టయినా అని ప్రజల నమ్మకం.
మిగతా కాలాల్లో ఆకపచ్చగా ఉండే ఈ చెట్టు ఆకులు శరత్కాలంలో మాత్రం మంత్రం వేసినట్లు మొత్తం బంగారు రంగులోకి మారిపోతాయి. నేలపై రాలిన ఆకులను, చెట్టుపై ఉన్న ఆకులను చూస్తూ ఉంటే మరో ప్రపంచంలో ఉన్నట్లు అనిపిస్తుంటుంది. బంగారు చెట్టేమో అనేలా కనిపించే ఈ అద్భుత దృశ్యాన్ని చూడ్డానికి జనం తండోపతండాలుగా వస్తుంటారు. అసలే ఇది సోషల్ మీడియా కాలం కావడంతో దీని గురించి విదేశీయులకు కూడా తెలిసిపోయింది. అక్టోబర్, డిసెంబర్ నెలల మధ్య రోజూ 60 వేల మంది దీన్ని చూడ్డానికి వస్తున్నారంటే సీన్ అర్థం చేసుకోవచ్చు. దీన్ని చూడాలంటే తిరుపతి వెంకన్న గుడిలో మాదిరి క్యూలో నాలుగైదు గంటలు నిలబడాలి. కరోనా టైం కాబట్టి రద్దీని తగ్గించడానికి ప్రస్తుతం రోజుకు 8 వేల మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. అందుకే ఈ చెట్టును చూడాలనుకునే వారు ముందే రిజర్వేషన్ చేయించుకోవాలి. దీని కోసం ఓ వెబ్ సైట్ కూడా ఉందండోయ్..