వంగవీటి మోహన రంగా కుమారుడు వంగవీటి రాధా సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశం నిర్వహించిన ఆయన వైసీపీలో తనకు ఎన్నో అవమానాలు జరిగాయన్నారు. అభిమానుల కోసమే వైసీపీకి రాజీనామా చేసి టీడీపీకి వెళ్లానని స్పష్టం చేశారు. ‘మా నాన్న విగ్రహ ఆవిష్కరణకు వెళ్లేందుకు అనుమతి తీసుకోవాలన్నారు. వెళ్తే ఎందుకు వెళ్లావని మందలించారు. తండ్రిలేని వాడివి అని పార్టీలో ఉంచుకున్నాం.. ఇది నా పార్టీ.. నేను వదిలేస్తే గాలికి కొట్టుకుపోతావు అన్నారు’ అని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తనలాంటి అవమానాలు మరెవ్వరికీ జరగొద్దని భావించానని, తనకు తండ్రి ఆశయాలే ముఖ్యమని తేల్చి చెప్పారు. తన తండ్రిని చంపింది వ్యక్తులు అని, దాన్ని పార్టీలకు ఆపాదించవద్దని విజ్ఞప్తి చేశారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక తనపై రెక్కీ జరిగిందని, చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయని వెల్లడించారు. తాను తాడూ బొంగరం లేని వాడ్నని, చంపుకోవాలంటే చంపుకోవచ్చని సూటిగా స్పందించారు. స్వార్థ ప్రయోజనాల కోసం వైసీపీ కుల కుంపట్లు రాజేస్తోందని, కపట ప్రేమ, అసత్య ప్రచారాలతో కాపులను మోసగించాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు ఇప్పటి సీఎం వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ యాత్రకు కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీ నో చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన జగన్.. వైసీపీ పేరుతో సొంతంగా పార్టీ స్థాపించారు. తర్వాత ఒంటరిగా పోటీ చేసి ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఘన విజయం సాధించి అధికారం చేపట్టారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నారు. అయితే అప్పుడు జగన్ కి ఎదురైన తరహాలోనే వైసీపీలో తనకు అవమానాలు ఎదురయ్యాయన్న కోణంలో రాధా వ్యాఖ్యలు చేయడంతో ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది.