చిదంబరమే కారణమని రిటైర్డ్ ఐఏఎస్ ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

చిదంబరమే కారణమని రిటైర్డ్ ఐఏఎస్ ఆత్మహత్య

September 9, 2019

Retired IAF officer bijan das.

ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యానికి కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరమే కారణమని ఆరోపిస్తూ ఓ రిటైర్డ్ ఐఏఎఫ్‌ అధికారి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపుతోంది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో చోటుచేసుకుంది. అసోం రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ ఐఏఎఫ్‌ అధికారి బిజన్‌ దాస్‌ ప్రయాగ్‌ రాజ్‌‌లోని ఓ హోటల్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక మాంద్యానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని నిందించరాదని ఆత్మహత్య లేఖలో పేర్కొన్నారు. ఈయన సెప్టెంబర్‌ 6న ప్రయాగ్‌ రాజ్‌ హోటల్‌లో దిగారు. అప్పటి నుంచి ఎంతకూ బయటకు రాలేదు. దీంతో హోటల్‌ సిబ్బంది ఆయన గది తలుపులు పగల కొట్టి వెళ్లి చూడగా ఆయన ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించారు. ఐదు పేజీల ఆత్మహత్య లేఖ, అంత్యక్రియల కోసం రూ.1,500, హోటల్ గది ఛార్జీల కోసం మరో రూ.500 మంచంపై ఉంచారు. అంత్యక్రియలకు రూ.1500 అంతకుమించి ఖర్చు చేయరాదని ఆత్మహత్య లేఖలో పేర్కొన్నారు.

చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన కుంభకోణాలు, యుపిఏ ప్రభుత్వ నిధుల దుర్వినియోగమే ఆర్థిక మాంద్యానికి కారణమన్నారు. ‘ఎక్కడైతే కుంభకోణాలు, నిధుల దుర్వినియోగం జరుగుతుందో అక్కడ వాటి దుష్పరిణామం వెంటనే ఉండదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ప్రభావం ఉంటుంది. మోదీ హయాంలో చేపట్టిన నోట్ల రద్దు, జీఎస్టీ అమలు ఆర్థిక వ్యవస్థపై కొంత మేరకు ప్రభావితం చేసి ఉండవచ్చు. కానీ, మొత్తానికి మోదీ ప్రభుత్వాన్ని నిందించడం సరికాదు’ అని ఆత్మహత్య లేఖలో పేర్కొన్నారు. తన కొడుకు పేరు వివేక్‌ దాస్‌ అని, మోదీ తన కుమారుడిని ఆదుకోవాలని అందులో రాశారు. వివేక్‌ సరిగమప లిటిల్‌ ఛాంప్స్‌ రియాలిటీ షోలో పాల్గొంటున్నాడని తెలిపారు. అలహాబాద్‌లోనే తనకు అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను కోరారు. హోటల్ సిబ్బంది సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి దర్యాప్తు ప్రారంభించారు.