ఎంతో సామాజిక బాధ్యత ఉన్న ఓ రిటైర్డ్ ఆర్మీ మేజరే తప్పుడు వార్తల ప్రచారానికి పూనుకున్నాడు. దీంతో అతని మీద పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ది స్కిన్ డాక్టర్ పేరుతో ఫేక్ ట్విటర్ అకౌంట్ నడుపుతూ.. దాంతో ఫేక్ న్యూస్ ప్రచారానికి తెరలేపాడు. ఇంతకీ ఆయన ఏం ట్వీట్ చేశాడంటే.. ‘సైబరాబాద్ పోలీసులు నగరంలో నారింజ అమ్మకాన్ని నిషేధించారు. బత్తాయి రంగు ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తున్నందున నగరంలో బత్తాయిలను ప్రదర్శనకు ఉంచడమ కానీ, అమ్మకం కానీ చేయకుండా సైబరాబాద్ పోలీసులు నిషేధించారు’ అని అతను పోస్ట్ చేశాడు. దానికి తోడుగా వార్తాపత్రిక క్లిప్పింగ్‌ను మార్ఫ్ చేసి, ఆ ఇమేజ్‌ని జతచేసి పోస్ట్ చేశాడు. అయితే ఆ క్లిప్పింగ్‌లో కమిషనర్ సజ్జనార్ సహా పోలీసు అధికారుల ఫోటో కూడా ఉంది. ఆ ఫోటోలో వారు బత్తాయి పళ్ళను టేబుల్ మీద ఉంచి మీడియాతో మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఆ ఫోటో కింద “theskindoctor13” వ్యంగ్య చిత్రం అని పేర్కొన్నాడు. దీనిని ఏకంగా సైబరాబాద్ పోలీస్ అధికారిక ట్విటర్‌కు ట్యాగ్ చేసి “Wtf! ఇది నిజమా అని ప్రశ్నించాడు.
దీనిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఈ విష ప్రచారానికి పూనుకున్న రిటైర్డ్ మేజర్ నీలం సింగ్‌ను అరెస్ట్ చేసి, అతని మీద క్రిమినల్ కేసు నమోదు చేశారు. ‘theskindoctor13 అనే నకిలీ ట్విటర్ అకౌంట్‌తో నీలం సింగ్ నకిలీ వార్తను పోస్ట్ చేశాడు. డెక్కన్ క్రానికల్ పత్రికలో ఒక పాత కథనాన్ని సవరించి ఈ నకిలీ వార్తా కథనాన్ని సృష్టించాడు. ఇలాంటి పోస్టులు పౌరులను తప్పుదారి పట్టించవచ్చు. మత సామరస్యాన్ని కూడా దెబ్బతీసే అవకాశం ఉంది. ఇలాంటి నకిలీ, అభ్యంతరకరమైన పోస్టులను పోస్ట్ చేయవద్దు’ అని పోలీసులు వెల్లడించారు.