చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్ కేసు.. సుప్రీం సంచలన నిర్ణయం - MicTv.in - Telugu News
mictv telugu

చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్ కేసు.. సుప్రీం సంచలన నిర్ణయం

December 11, 2019

Telangana

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు వ్యవహారం మరో మలుపు తీసుకుంది. నిందితుల ఎన్‌కౌంటర్ కేసు సుప్రీం కోర్టుకు చేరింది. దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిల్‌పై చీఫ్ జస్టిస్ బాబ్డే విచారణకు స్వీకరించారు. బుధవారం విచారణ సందర్భంగా కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై  జ్యుడీషియల్ విచారణకు ధర్మాసనం ప్రతిపాదించింది. మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తితో సిట్ ఏర్పాటు చేయాలని సూచించింది. దీనికి కావాల్సిన న్యాయమూర్తిని కూడా తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసి తమకు పంపాలని ఆదేశించింది. అంతకు ముందు తాము రిటైర్డ్ జస్టిస్ పీ.వీ రెడ్డిని సిట్‌కు నేతృత్వం వహించాలని కోరగా ఆయన దానికి నిరాకరించినట్టుగా సీజే తెలిపారు. 

ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం తరుపున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్గీ వాదించారు. కేసు దర్యాప్తుపై సలహాలు సూచనలతో రావాలని ధర్మాసనం సూచించింది. ఢిల్లీ నుంచే సిట్‌ అధికారి విచారణపై పర్యవేక్షణ జరిపేలా ఆదేశాలు ఇచ్చింది. సిట్ అన్ని అంశాలను వెలికి తీస్తుందని సీజే అభిప్రాయపడ్డారు. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. కాగా దిశపై అత్యాచారం, హత్య ఘటన దర్యాప్తులో భాగంగా సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం వెళ్లగా అక్కడ ఎదురుకాల్పులు జరిగాయి. దీనిపై మానవ హక్కుల సంఘాలు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇది భూటకపు ఎన్‌కౌంటర్ అంటూ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్ దర్యాప్తు చేపట్టి ఆధారాలు సేకరించిన సంగతి తెలిసిందే.