దూకుడు నేతగా పేరున్న రేవంత్ రెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పడంతో ఇప్పుడు అందరి దృష్టీ కాంగ్రెస్ వైపుకు మళ్లింది. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ అయిన రేవంత్ రేపోమాపో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే తెలంగాణ టీడీపీలో అంతా తానే అన్నట్లు నడిపించిన రేవంత్.. హస్తం పార్టీలోకి వెళ్తే అదే హవా కొనసాగించగలడా అన్నది ఆసక్తికరంగా మారింది. రేవంత్ రాకతో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు రంజుగా మారతాయి. అయితే ఆయనకు పార్టీలో ఇప్పుడిప్పుడే ప్రాధాన్యం లభించే అవకాశాలు లేకపోవచ్చు.
సీనియర్లు ఊరుకుంటారా?
టీఆర్ఎస్ ప్రభంజనాన్ని తట్టుకుంటూ.. ఇంకా కాంగ్రెస్‌నే నమ్ముకుని ఉన్న సీనియర్ నేతలు రేవంత్ రాకను ప్రస్తుతానికైతే బాగానే ఆహ్వానిస్తున్నారు. అయితే కొత్తగా చేరే ఆయనకు కీలక పదవులు అప్పగించడానికి వారు సుముఖత వ్యక్తం చేయకపోవచ్చు. అయినప్పటికీ తనకంటూ బలమైన కేడర్‌ను, సొంత పలుకుబడిని కలిగి ఉన్న రేవంత్ కాంగ్రెస్‌లో త్వరగానే బలంగా పాతుకుపోయే అవకాశముంది. రేవంత్ లక్ష్యం ఎంపీ కావడమే కనుక స్థానికంగా అతడు మీకు పోటీ రాడని అధిష్టానం సీనియర్లకు నచ్చజెపొచ్చు.
రేవంత్ రాకవల్ల సీనియర్ల బాధ్యతల్లోనూ మార్పులు వస్తాయి కనుక వారికీ కాంగ్రెస్ ఏదో రకంగా లబ్ధి చేకూర్చాల్సి ఉంటుంది. అయితే దేశంలో ఇప్పుడే బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌కు ఇప్పటికిప్పుడు ఇది సాధ్యం కాదు. మొత్తానికి కేసీఆర్‌పై పోరాటమే పార్టీ లక్ష్యం కనుక వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు హస్తం పార్టీ నేతలు ఏకతాటిపై నిలబడాల్సి ఉంటుంది. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి రేవంత్ తన దూకుడును కచ్చితంగా తగ్గించుకోవాల్సిదే.