తెలంగాణను దోచుకుంటున్న కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణను దోచుకుంటున్న కేసీఆర్

October 31, 2017

కాంగ్రెస్‌లో చేరిన మొదటిరోజే రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఆయన రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడాలనే కాంగ్రెస్‌ చీఫ్ సోనియాగాంధీ ఆశించారని ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని, అయితే రాష్ట్రం వచ్చాక కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని అన్నారు.

‘తెలంగాణ ఇస్తే  ఆంధ్రపదేశ్‌లో కాంగ్రెస్‌ దెబ్బతింటుందని తెలిసినా సోనియా పట్టించుకోకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చారు. రాష్ట్రం వచ్చాక కేసీఆర్‌ ఎవర్నీ లెక్కచేయడంలేదు. గత 40 నెలల్లో 3,400మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రం వచ్చాక కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కొడుకు మంత్రి అయ్యారు.  కుటుంబంలోని నలుగురికి పదవులు వచ్చాయి.  పత్రిక, చానెల్‌ పెట్టి రాష్ట్రాన్ని కేసీఆర్‌ దోచుకుంటున్నారు’ అని ధ్వజమెత్తారు. అంతేకాకుండా ఒప్పుడు ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించిన టీడీపీతోనే కేసీఆర్ కుమ్మక్కయి, వారికి రాష్ట్ర సంపదను దోచిపెడుతున్నారని రేవంత్ ఆరోపించారు. తమ నాయకుడు రాహుల్‌ నాయకత్వంలో కేసీఆర్‌ దుష్టపాలనకు  వ్యతిరేకంగా పోరాడుతామని ప్రతినబూనారు.