నన్ను దెబ్బకొట్టేందుకే కేసీఆర్ తాయిలాలు - MicTv.in - Telugu News
mictv telugu

నన్ను దెబ్బకొట్టేందుకే కేసీఆర్ తాయిలాలు

October 28, 2017

తెలంగాణ టీడీపీ నేతలు సార్థప్రయోజనాల కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వంతో లాలూచీ పడ్డారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తనను రాజకీయంగా దెబ్బకొట్టడానికి కేసీఆర్ వారికి తాయిలాలు  గుప్పిస్తున్నారని ఆరోపించారు.

టీడీపీనీ వీడుతున్న చంద్రబాబుకు రాసిన లేఖలో ఆయన పలు అంశాలు ప్రస్తావించారు. ‘పార్టీపై, పార్టీ అధ్యక్షుడిపై నాకు ఎంతో గౌరవం ఉంది. నన్ను తక్కువ సమయంలో పార్టీ ఉన్నత పదవులను నిర్వహించేలా చేసింది. నా ఎదుగుదలకు బాబు ఎంతో కృషి చేశారు. చంద్రబాబు నాకు తండ్రితో సమానం. ఎల్లప్పుడూ పార్టీ, కార్యకర్తల శ్రేయస్సు కోరుకునే వ్యక్తిని నేను.

ఏపీ, టీటీడీపీ సీనియర్లు తమ స్వార్థం కోసం ఇతర పార్టీల నేతలతో చేతులు కలిపి టీటీడీపీని నాశనం చేస్తున్నారు. నేను కేసీఆర్‌పై పోరాటం చేస్తుంటే ఏపీ, టీటీడీపీకీ చెందిన నేతలు ఆయనతో కలిసి సమావేశం నిర్వహించారు. మరికొంతమంది టీఆరెస్ ప్రభుత్వంతో లాలూచీపడి కాంట్రాక్టులు తెచ్చుకున్నారు. అలాంటప్పుడు నా పోరాటానికి విలువ ఎక్కడ ఉంటుంది? నన్ను ఇబ్బందులకు గురిచేయడం కోసం, నన్ను దెబ్బకొట్టడం కోసం కేసీఆర్ టీడీపీ నేతలకు తాయిలాలు ఇస్తున్నారు.

నేను పార్టీ సంక్షేమం కోరుకునే వ్యక్తిని, నా స్వార్థం కోసం ఎప్పుడు పార్టీని అడ్డుపెట్టుకోలేదు. టీడీఎల్పీ నేతగా ఉన్నా నాకన్నా సీనియర్ అయిన సండ్రకు అన్ని బాధ్యతలు అప్పగిస్తూ స్పీకర్‌కు గతంలో లేఖ రాశా. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడేందుకు కూడా ఎక్కువ సమయం పార్టీలోని మా ఎమ్మెల్యేలకు ఇచ్చా. కేసీఆర్ నియంత పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిపించాలి.

నా పోరాటం ఎప్పుడు కేసీఆర్, టీఆర్ఎస్పైనే. పార్టీ క్యాడర్‌ను చూస్తే చాలా బాధగా ఉంది. తెలంగాణలో టీడీపీ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. నేను ఈరోజు స్థాయిలో ఉండటానికి కార్యకర్తలు,  బాబునే కారణం. టీడీపీ క్యాడర్ నాకు ప్రాణంతో సమానం. కొడంగల్‌లో కార్యకర్తలతో చర్చించాకే ఏదైనా నిర్ణయం..’ అని పేర్కొన్నారు.