గుండె కోతపెడుతోంది.. - MicTv.in - Telugu News
mictv telugu

గుండె కోతపెడుతోంది..

October 28, 2017

‘ఈ బంధాన్ని తెంచుకోవడం గుండెకోతతో సమానం.. ’ ఇదీ రేవంత్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేస్తూ రాసిన లేఖలోని సారాంశం. పార్టీతో తన అనుబంధాన్ని, విభేదాలను ఆయన తీవ్ర భావోద్వేగంతో లేఖలో తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరుతోపాటు పలు అంశాలను ఆయన తడిమారు. తెలంగాణాలో కొందరి స్వార్థం వల్ల పార్టీ నాశనమైపోతోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేవారు. ఆంధ్రానేతల తీరును కూడా తీవ్రంగా ఎండగట్టారు. రేవంత్  తెలంగాణ టీడీపీ ముఖచిత్రంతోపాటు రాష్ట్ర పరిస్థితులను ఆయన సోదాహరణంగా వివరించారు.. ప్రజా సంక్షేమమే తన లక్ష్యమని, జైల్లో పెట్టినా తాను వెనకడుగు వేయలేదని పేర్కొన్నారు. లేఖ పూర్తి పాఠం ఇదీ..

 

రేవంత్ రెడ్డి రాజీనామా లేఖ

నా పోరాటాలకు ఎన్టీఆర్ కూడా స్ఫూర్తి. తెలంగాణ సమాజంపై ఆయనది చెరగని ముద్ర. సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అన్న నందమూరి ఆలోచనకు మించిన సిద్దాంతం లేదు. సమాజంలో ఆయన నుంచి వెళ్లిన ఆదేశం ఇంకా ఇంకిపోలేదు. విప్లవాత్మక సంస్కరణలతో ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు.  అన్నగారితో నేరుగా అనుబంధం లేకపోయినా పేదోళ్ల బాగు కోసం ఆయన పరితపించిన విధానం నాలో స్ఫూర్తిని నింపింది. తెలుగుదేశం కుటుంబంతో నా అనుబంధాన్ని ఎంత వివరించినా తక్కువే. వాస్తవానికి ఈ బంధాన్ని తెంచుకోవడం గుండెకోతతో సమానం.

కేసీఆర్ సర్కారు అరాచకాలపై పోరాడాలనుకున్నా..

కేసీఆర్ అరాచకాలను టీడీపీ ద్వారానే అంతమొందించాలని కోరుకున్నాను. మీ అండతో ఆ దిశగా పోరాటం చేశాను. ఈ సందర్భంలో తెలంగాణలో వాస్తవ పరిస్థితులు మీ ముందు పెడుతున్నాను. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలోని టీఆర్ఎస్ పాలన ప్రజల జీవితానలు చిన్నాభిన్నం చేసింది. అమరవీరులు, ఉద్యమకారులు, నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, దళిత, గిరిజన మైనారిటీలు, బీసీలు, మహిళలు ఇలా ఏ వర్గాన్ని తట్టి చూసినా కన్నీళ్లు కఫ్టాలే కనిపిస్తున్నాయి. వేల మంది రైతులు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు.

రైతులకు బేడీలు వేశారు..

ఖమ్మంలో అమాయక గిరిజన రైతులకు బేడీలు వేసి, నడిరోడ్డుపై నడిపించి, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. భూసేకరణ పేరుతో మల్లన్నసాగర్ ప్రాంతాన్ని రావణకాష్టంగా మార్చారు. వారి దు:ఖాన్ని చూసి పోరాటంలో టీడీపీ అండగా నిలిచింది. నేరెళ్లలో దళిత, బీసీ బిడ్డలపై పోలీసులు అన్యాయంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. భూపాలపల్లి జిల్లాలో అనేక ఏళ్లుగా అటవీ భూముల్లో పోడు వ్యవసాయం చేసుకుంటోన్న గిరిజనులపై ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. గుత్తికోయ ఆడబిడ్డలను బట్టలూడదీసి, చెట్టకు కట్టేసి కొట్టిన పరిస్థితులు హ్రుదయవిదారకరం. చదువుకున్న విద్యార్థులను నక్సలైట్ల ముద్రతో ఎన్ కౌంటర్ చేస్తోన్న సంఘటనలు ఆవేదన కలిగించాయి.

విపక్షాల గొంతు నొక్కుతున్నారు..

ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకలను నొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాల ఉనికిని కేసీఆర్ సహించలేకపోతున్నారు. ప్రజాస్వామిక హక్కులకు ఈ రాష్ట్రంలో చోటే లేదు. అత్యున్నత వ్యవస్థలను తన అధికార దర్పానికి కాపలా కాసే సంస్థలుగా మార్చుకున్నారు. తెలంగాణలో ప్రజాస్వామిక వ్యవస్థల విధ్వంసం నిరాఘాటంగా సాగుతోంది. ఈ దుర్మార్గాలపై గడిచిన మూడేళ్లుగా అసెంబ్లీలోను, వెలుపల టీడీపీ పోరాటం చేస్తోంది. సభలో ప్రజల గొంతుక వినిపించే ప్రతి సందర్భంలోను మాపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ నేపథ్యంలో ప్రజాక్షేత్రంలో అనేక ఉద్యమాలు చేశాం. రైతుపోరు, విద్యార్థి పోరు, ప్రజాపోరు, కార్మికుల పోరు లాంటి ఉద్యమాలతో ప్రజలను చైతన్యపరిచాం.

ప్రజాసంక్షేమమే నా గమ్యం..

మీ నాయకత్వంలో నా అదృష్టం ‘ప్రజలతో ఉండటం నా నైజం ప్రజల కోసం పోరాటం నా తత్వం. ప్రజా సంక్షేమం నా గమ్యం. నా స్వభావానికి తగ్గట్లు ప్రజా జీవితంలోకి వచ్చాను. విద్యార్థి ఉద్యమాలలో నా వంతు పాత్ర పోషించాను. 2006లో జెడ్‌పీటీ(ఇండిపెండెంట్)గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించాను. 2007లో స్వతంత్ర ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాను.  ప్రజల కోసం మరింత విస్తృతంగా పని చేయాలని నిర్ణయించుకున్నాను. దానికి తెలుగుదేశం సరైన వేదిక అని భావించాను. రాష్ట్ర భవిష్యత్తు, ప్రజాక్షేమం దృష్ట్యా మీ నాయకత్వంలో పనిచేయడం సముచితమని నమ్మాను. ఇన్నేళ్లుగా ప్రజల పక్షాన చేసిన పోరాటాలు నాకు గొప్ప అనుభవాన్నిచ్చాయి. దేశంలో ఏ నాయకుడికి లేని సుదీర్ఘ రాజకీయ, పాలనా అనుభవం ఉన్న మీతో ప్రయాణం ఎప్పటికీ మరిచిపోలేనిది. మీ సారథ్యంలో అనేక ప్రజాపోరాటాలలో భాగస్వామికావడం అదృష్టంగా భావిస్తున్నాను.

మీ మార్గదర్శకత్వంలో నాయకుడిగా ఎదిగా..

ప్రతి అడుగులో మీ మార్గనిర్దేశనం, కార్యకర్తల మద్దతు నన్ను ప్రజా నాయకుడుగా మలిచాయి. చంద్రబాబునాయుడు సహచరుడుగా, తెలుగుదేశం నేతగా గుర్తింపు పొందడం నేను ఎప్పటికీ గర్వించే విషయం. టీడీపీలో చేరిన నాటి నుంచి ఈ క్షణం వరకు పార్టీ సిద్ధాంతాలకు, మీ నిర్ణయాలకు కంకణబద్ధుడనై పని చేస్తూ వచ్చాను. మీరు అప్పగించిన ప్రతి పని త్రికరణ శుద్ధిగా పూర్తి చేసే ప్రయత్నం చేశాను. తక్కువ సమయంలోనే మీరు, పార్టీ నాకు గుర్తింపునిచ్చారు. మీరు భుజంతట్టి ప్రోత్సహించిన తీరు నాలో విశ్వాసాన్ని పెంచింది. సీనియర్లు అనేక మంది ఉన్నా కీలక అవకాశాలను పార్టీ నాకు ఇచ్చింది. వాటన్నింటినీ నా శక్తి మేరకు సమర్థవంతంగా నిర్వర్తించానని నమ్ముతున్నాను. కార్యకర్తలతో నా అనుబంధం విడదీయరానిది. మీతోపాటు నేను అంతగా అభిమానించేది వాళ్లనే. లక్షలాది కార్యకర్తలు నన్ను తమ ఇంట్లో మనిషిగా అభిమానించారు. మీ సొంత మనిషిగా గుర్తించి, నన్ను ఆరాధించారు. పోరాటాల్లో నా వెన్నంటే ఉన్నారు. కష్టాల్లో నష్టాల్లో అండగా నిలిచారు. తెలంగాణలో కార్యకర్తలను చూస్తే గర్వంగా ఉంటుంది. పార్టీ కోసం ప్రాణాలిచ్చిన వారున్నారు. ఆస్తులు కోల్పోయిన వాళ్లున్నారు. మీరిచ్చిన ప్రోత్సాహం, వాళ్లిచ్చిన ధైర్యంతోనే నలభై నెలలుగా కేసీఆర్ అరాచక పాలనపై పోరు సాగించాను.

జైల్లో పెట్టినా వెనక్కి తగ్గలేదు..

నాపై పాలకులు వ్యక్తిగతంగా కక్షగట్టి, అక్రమ కేసులతో వేధించిన విషయం మీకు తెలిసిందే. అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సందర్భంలోనూ నేను వెనుకడుగు వేయలేదు. నా బిడ్డ నిశ్చితార్థానికి కోర్టు కొన్ని గంటల మాత్రమే అనుమతించిన సందర్భంలోనూ గుండెనిబ్బరం కోల్పోలేదు. ఆ సందర్భంలోనూ నాకు, నా కుటుంబానికి మీరు, భువనేశ్వరి మేడమ్ గారు కుటుంబ పెద్దలుగా నిలిచినందుకు కృతజ్ఞతలు. కష్టాల్లో ఉన్నప్పుడు మీరిచ్చిన మద్దతు మా కుటుంబం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది.

తెలంగాణ కేసీఆర్ చేతిలో బందీ..

ప్రస్తుతం తెలంగాణ సమాజం అత్యంత ప్రమాదపుటంచుల్లో ఉంది. కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయింది. బంగారు తెలంగాణ ముసుగులో ప్రజాసంపద అడ్డగోలుగా దోపిడీ అవుతోంది. ప్రజలు ఏ ఆకాంక్షలతో స్వరాష్ట్రం కోరుకున్నారో వారి ఆశలు కలలుగానే కరిగిపోతున్నాయి. అమరవీరుల ఆత్మబలిదానాలకు గుర్తింపు లేదు. ఈ పరిస్థితిని మార్చడానికి గత మూడేళ్లుగా అనేక పోరాటాలు జరిగాయి. అయితే, తెలంగాణ సమాజం ఏకతాటిపై నిలబడి, కేసీఆర్ కుటుంబ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అనివార్యం కనిపిస్తోంది. ఈ సందర్భంలో ప్రజలెన్నుకున్న నాయకుడుగా వారి పక్షాన నిలవడమే ప్రాధాన్యం అని నమ్మకున్నాను. తెలంగాణ సమాజ హితం కోసం నేను మరింత ఉధృతంగా పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.

కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణ సమాజానికి విముక్తి కల్పించడం బాధ్యతగా భావిస్తున్నాను. తెలంగాణ సమాజం కేసీఆర్‌కు వ్యతిరేకంగా బలమైన రాజకీయ పునరేకీకరణ కోరుకుంటోంది. నా నిర్ణయాన్ని మీరు ఆ కోణంలోనే చూడండి. ఈ నేపథ్యంలో పార్టీ తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పిస్తున్నాను. పార్టీ అధ్యక్షుడుగా, మార్గదర్శిగా మీరు ఇచ్చిన పోరాట పటిమ, స్ఫూర్తి గుండెలనిండా నింపుకుని తెలంగాణ సమాజ హితం కోసం మరింత విస్తృత పోరాటానికి సిద్ధమవుతున్నాను. అన్యధా భావించక.. నా నిర్ణయాన్ని సహృదయంతో అర్థం చేసుకుంటారని..

ఆశిస్తూ

ఇట్లు మీ రేవంత్ రెడ్డి