తెలంగాణ టీడీపీకి టులెట్ బోర్డు! - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ టీడీపీకి టులెట్ బోర్డు!

October 28, 2017

రేవంత్ రెడ్డి నిష్క్రమణతో తెలంగాణ టీడీపీ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. పార్టీ గొంతును బలంగా వినిపిస్తూ.. టీఆర్ఎస్ విధానాలను సునిశితంగా విమర్శిస్తూ తనకంటూ ఒక ఇమేజిని సాధించుకున్న రేవంత్ లేని లోటు టీటీడీపీకి పూడ్చలేనిదే.

రేవంత్ బాటలో మరికొందరు కీలక నేతలు కూడా పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉండడం అధినాయకత్వాన్న ఇబ్బంది పెడుతోంది. ఇదే జరిగితే రాష్ట్రంలో పార్టీకి కోలుకోని దెబ్బే. రేవంత్ వెళ్లిపోవడంతో అసెంబ్లీలో టీడీపీ గొంతు కూడా మూగబోనుంది. సండ్ర వెంకట వీరయ్య, కృష్ణయ్యలు బలమైన టీఆర్ఎస్ సర్కారుతో తలపడే అకాశం లేదు.

అయితే టీడీపీ రాష్ర్ట అధ్యక్షుడు ఎల్. రమణ, మోత్కుపల్లి నరసింహులు, సండ్ర వంటి ముఖ్య నేతలతో పార్టీ ఇకపైనా మనుగడ సాగించే అవకాశముంది. టీడీపీ జాతీయ పార్టీ కావడంతో బాబు ప్రతిష్టకు తీసుకునైనా సరే తెలంగాణలో ఉనికి కాపాడుకోవడానికి చేయాల్సిందంతా చేస్తారని పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్నిచేసినా టీడీపీకి పూర్వవైభవం రాదని, ఉన్నవారు బయటికిపోకుండా కాపాడుకుంటే చాలని కూడా అంటున్నారు.

భవిష్యత్తులో చంద్రబాబైనా, మరొకరైనా తెలంగాణలో టీడీపీని ‘ఉనికి’ స్థాయి నుంచి వృద్ధి స్థాయికి తీసుకుపోవడానికి చాలా ఆటంకాలు ఉన్నాయి. టీడీపీ ఆంధ్రావాళ్ల పార్టీ అనే భావన ఇప్పటికీ తెలంగాణ ప్రజల్లో బలంగానే ఉంది. అంతేకాకుండా.. కృష్ణ, గోదావరి జలాల పంపకంలో భవిష్యత్తులోనూ ఏపీతో తెలంగాణకు వివాదాలు నడుస్తాయి. 2019 ఎన్నికల్లోనూ ఏపీలో బాబు సర్కారే అధికారంలోకి వస్తే పరిస్థితి ఏమాత్రం మారదు. తెలంగాణ టీడీపీ నేతలు.. తమ రాష్ట్ర ప్రయోజనాలకోసం ఉద్యమిస్తే ఏపీలోని అధిష్టానంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ప్రయోజనాల మధ్య వైరుధ్య సమస్య ఏర్పడుతుంది. ఏపీ టీడీపీ నేతల నుంచి  తీవ్ర విమర్శలు వస్తాయి. ఈ నేపథ్యంలో టీటీడీపీ పేరుకు మాత్రమే అన్న చందంగా తయారవుతుంది. మరోపక్క.. కాంగ్రెస్ రేవంత్ రాకతో పుంజుకునే అవకాశముంది. అదే జరిగితే తెలంగాణ టీడీపీ బలమైన నాయకత్వం కొరవడి.. వామపక్షాల స్థాయికి పడిపోతుంది. ఎంత విశ్వసనీయమైన కేడర్ ఉన్నా.. బలమైన నేత లేని కొరత ఇప్పుడు టీటీడీపీలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.