కామాటిపుర పోలీస్‌స్టేషన్‌కు రేవంత్ - MicTv.in - Telugu News
mictv telugu

కామాటిపుర పోలీస్‌స్టేషన్‌కు రేవంత్

October 21, 2019

Revant Reddy to Kamatipura Police Station.

ముఖ్యమంత్రి కేసీఆర్ మొండి వైఖరిపై సమ్మె చేస్తూ ప్రాణాలు కోల్పోతున్న ఆర్టీసీ కార్మికులకు అండగా అక్టోబర్  21న ప్రగతి భవన్ ముట్టడి చేస్తామని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అన్నట్టుగానే నేడు ప్రగతిభవన్‌ ముట్టడికి యత్నించారు. గృహనిర్బంధంలో ఉన్న రేవంత్‌.. ప్రగతిభవన్‌ ముట్టడి కోసం జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి బయల్దేరారు. ఇంటివద్ద ఉన్న పోలీసులను తప్పించుకొని ద్విచక్రవాహనంపై ఆయన ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను పాతబస్తీలోని కామాటిపుర పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

తొలుత ఆయనను గోల్కొండ ప్రాంతంలోని గోల్ఫ్‌కోర్టులో కొద్దిసేపు ఉంచారు. అక్కడి నుంచి వేరే వాహనంలో తీసుకెళ్లి ఔటర్‌రింగ్‌ రోడ్డు సమీపంలోని పుప్పాలగూడ, నార్సింగ్‌ తదితర ప్రాంతాల్లో తిప్పుతూ చివరికి కామాటిపుర పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులను వెంటనే చర్చలకు పిలవాలి. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. కేసీఆర్ నియంతృత్వపు పోకడలు నశించాలి. కేసీఆర్‌ను ప్రజలు త్వరలోనే ఇంటికి పంపిస్తారు. త్వరలోనే ప్రగతి భవన్‌ను ప్రజలే బద్దలు కొడతారు’ అని మండిపడ్డారు. అంతకుముందు ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ హౌస్ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్‌లోని మణికొండలో ఆయన నివాసంలోనే పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.