కేసీఆర్ అవినీతిపై మౌనమెందుకు? అమిత్ షాకు రేవంత్ 9 ప్రశ్నలు - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ అవినీతిపై మౌనమెందుకు? అమిత్ షాకు రేవంత్ 9 ప్రశ్నలు

May 14, 2022

నేడు హైదరాబాద్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వస్తున్న నేపథ్యంలో… టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయనకు 9 ప్రశ్నలు సంధించారు. ఎనిమిదేళ్లుగా కేసీఆర్ కుటుంబ అవినీతిని ఉపేక్షించడం వెనుక రహస్యం ఏమిటో చెప్పాలన్నారు. రైతులకిచ్చే ఎరువుల సబ్సిడీలను కేంద్రం ఎందుకు ఎత్తివేసిందన్నారు. బ్యాంకులను రూ. వేల కోట్లకు ఎగనామం పెట్టిన బడాబాబబులు దేశాన్ని వదిలి స్వేచ్ఛగా ఎగిరిపోతుంటే.. రైతుల రుణాలను మాత్రం పైసలతో సహ ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

అమిత్ షాకు రేవంత్ రెడ్డి సూటి ప్రశ్నలు

1. ఎనిమిదేళ్లుగా కేసీఆర్ కుటుంబ అవినీతిని ఉపేక్షించడం వెనుక రహస్యం ఏమిటో చెబుతారా?

2. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారు. మానసిక క్షోభతో చనిపోయిన రైతుల మరణాలకు బాధ్యులు మీరు కాదా?

3. పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతికి ధన్యవాద ప్రసంగం సందర్భంగా తెలంగాణపై ప్రధాని మోదీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటు, ఉద్యమాన్ని కించపరిచేలా కామెంట్లు చేశారు. వాటికి వివరణ ఇచ్చి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేదంటే మీ రాకను తెలంగాణ ప్రజలు ఎలా ఆమోదిస్తారు? మా ప్రజలకు ఆత్మగౌరవం, ఆత్మాభిమానం లేదనుకుంటున్నారా?

4. మీ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నిజామాబాద్ జిల్లాలో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మాటలు నమ్మిన నిజామాబాద్ ప్రజలు అర్వింద్‌ను ఎంపీగా గెలిపిస్తే మూడేళ్లవుతున్నా పసుపుబోర్డు ముచ్చట లేదు. దీనికి మీ సమాధానం ఏమిటి? ఇది ప్రజలను మోసం చేయడం కాదా?

5. మీరు అధికారంలోకి వచ్చాక తెలంగాణ యువతకు ఉపాధి కల్పించే ఐటీఐఆర్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ లాంటి పథకాలన్నింటికీ మంగళం పాడారు. మీకు మా ప్రజలు ఎందుకు మద్దతు ఇవ్వాలి?

6. అయోధ్య నుంచి రామేశ్వరం వరకు ఉన్న రాముడి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే విధంగా ‘‘రామాయణం సర్క్యూట్’’ పేరిట శ్రీ రామాయణ్ యాత్ర ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రవేశ పెట్టారు. 7,500 కి.మీ. సాగే ఈ సర్క్యూట్‌లో భద్రాద్రి రాముడికి చోటు దక్కలేదు. భద్రాద్రి రాముడు రాముడు కాదా?

7. ఒడిశాలోని నైనీ కోల్ మైన్స్ టెండర్ కుంభకోణం వెనుక కేసీఆర్ కుటుంబ పాత్రపై వివరాలు సమర్పించాం. ఇంత వరకూ దీనిపై అతీగతీ లేదు. కారణం ఏమిటి? కేసీఆర్ అవినీతి విషయంలో మీరు నిజంగా అంత సీరియస్‌గా ఉంటే.. అది చేతల్లో ఎందుకు కనిపించడం లేదు?

8. పొరుగున ఉన్న కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. తెలంగాణలో రెండు ప్రధాన ప్రాజెక్టుల్లో ఒక్క దానికి కూడా జాతీయ హోదా ఇవ్వాలన్న ఆలోచన మీకు రాలేదు. అడిగే బుద్ధి టీఆర్ఎస్ కు ఎలాగూ లేదు. మీ దుర్మార్గ చట్టాలకు వారి మద్దతు. వారి అక్రమాలు, అవినీతికి మీ మద్దతు.. ఇదే కదా ఎనిమిదేళ్లుగా జరిగింది?

9. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలెండర్ ధరలే కాకుండా జనాలను పన్నులు, సెస్సులతో చావగొట్టే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఎందుకు క్షమించాలి?’’

అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.