తెలంగాణ సమాజాన్ని తక్కువ అంచనా వేస్తే.. కేసీఆర్ను బూట్లు చేతపట్టుకుని పరిగెత్తేలా చేస్తారని రేవంత్ హెచ్చరించారు. సామాజిక న్యాయాన్ని కేసీఆర్ తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన శ్రీకాంత్ చారి వర్దంతి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ అంటే గుర్తొచ్చేది ఉస్మానియా యూనివర్సిటీయే అని ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ సమాజంపై ఆధిపత్యం చెలాయించాలని ఆలోచన చేసినప్పుడల్లా కొట్లాడిన గడ్డ ఉస్మానియా అని రేవంత్ స్పస్టం చేశారు.
“తెలంగాణ బిడ్డల త్యాగాలతోనే సోనియా తెలంగాణను ప్రకటించారు. ఇప్పుడు రాష్ట్రాన్ని ఉద్యమకారుల ముసుగులో దోచుకుంటున్నారు.మలిదశ ఉద్యమంలో అమరులైన 1200 మంది కుటుంబాలకు ఆర్థిక సాయం, ఉద్యోగం, 3 ఎకరాల భూమి ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించి మరిచిపోయారు. 550 కంటే ఎక్కువ మంది అమరులను ప్రభుత్వం గుర్తించలేదు.ఆంధ్రావాళ్లకు అప్పగించిన అమరవీరుల స్తూపం కాంట్రాక్టు ఎనిమిదేళ్లైనా పూర్తికాలేదు. వీటినన్నింటిని దృష్టిలో పెట్టుకొని పెద్దలు భవిష్యత్ ప్రణాళిక రూపొందించాలి. తెలంగాణకు ఏం కావాలో అవి కాంగ్రెస్ మేనిఫెస్టో పెడతాం.దీని కోసం పెద్దల సూచనలు అందించాలి. ఇక కేసీఆర్ని దించితేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఆధిపత్యం, అణచివేతల వల్లే పోరాటాలు ఉద్భవించాయన్న రేవంత్.. సామాజిక న్యాయాన్ని కేసీఆర్ తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు.సామాజిక న్యాయం లేని రాష్ట్రం రాష్ట్రమే కాదని విమర్శించారు. మళ్లీ అలజడి రేగితే అందులో కేసీఆర్ కాలి బూడిద అవుతారని హెచ్చరించారు.