Revanth Reddy countered KCR
mictv telugu

జాతిరత్నాలు అమ్ముడుపోకుంటా ఉంటారా? – రేవంత్ రెడ్డి

November 18, 2022

టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి టీఆర్ఎస్, బీజేపీలపై ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యల నుంచి తప్పుదారి పట్టించేందుకు రెండు పార్టీలు రాజకీయాలను వివాదాస్పదం చేశాయని ఆరోపించారు. రైతు రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ వంటి సమస్యలపై చర్చ జరగకుండా ఎమ్మెల్యేల కొనుగోళ్ల నాటకానికి తెరలేపాయని విమర్శించారు. తమను ప్రలోభ పెట్టారని చెప్తున్న నలుగురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు సత్య హరిశ్చంద్ర వారసులా? అని ఎద్దేవా చేశారు.

అన్ని చోట్ల కెమెరాలు పెట్టాలని కేసీఆర్ చెప్పాడంట.. వీరు పట్టించారంట అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. నలుగురు ఎమ్మెల్యేలను మునుగోడుకి తీసుకెళ్లి ప్రజాస్వామ్య వాదులు, జాతి రత్నాలు అంటూ పరిచయం చేయడం చూస్తే కేసీఆర్ కు మతి భ్రమించిందేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. ‘కేసీఆర్.. ఎక్కడ కొట్టుకొచ్చావు ఈ జాతి రత్నాలని. అవి ఎక్కడివి. కాంగ్రెస్ లో గెలిచి మీకు అమ్ముడుపోయారు. అమ్ముడుపోయిన వాళ్లు అలాగే ఉంటారా? వాళ్లను నమ్మి నువ్వు రాజకీయం చేస్తున్నావా? కొనుగోళ్లపై వాళ్లు చెప్పగానే నీకు ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చిందా? ఇంత దిగజారిపోతావనుకోలేదు‘ అంటూ తనదైన శైలిలో వాగ్బాణాలు సంధించారు. మరోపక్క బీజేపీ తనను పార్టీ మారమంటూ చెప్పిందన్న కవిత, కేసీఆర్ మాటలను సుమోటోగా తీసుకొని పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సింగిల్ జడ్జీతో విచారించి ఆఫర్ ఇచ్చిన వాళ్లను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు.