తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అలుపెరగకుండా చుట్టేస్తున్నారు. ఆయన ‘హాత్ సే హాత్ జోడో’ పాదయాత్ర కరీంనగర్ జిల్లాలో జోరుగా సాగుతోంది. అధికార బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు, సొంతపార్టీలోని అసమ్మతి నేతలకు బజ్జగింపులతో రేవత హల్ చల్ చేస్తున్నారు. మంగళవారం నాటి యాత్రలో ఆయనకు ఓ సెలబ్రిటీ ఆతిథ్యం దక్కింది. బిగ్ బాస్ కమ్ యూట్యూబ్ ఫేమ్ గంగవ్వ ఆయనకు ఆత్మీయంగా మిర్చి బజ్జీ పెట్టింది. రేవంత్ కబుర్లు చెబుతూ వాటిని ఆరగించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాతో పంచుకున్నాడు కూడా. “గంగవ్వ… తెలంగాణకు పరిచయం అక్కర్లేని అవ్వ. ప్రపంచానికి తనొక సెలబ్రిటీ. నాకు మాత్రం ప్రేమను పంచిన అమ్మ. నాకోసం ఆప్యాయంగా, నాకు ఇష్టమైన మిర్చి బజ్జీ తీసుకువచ్చి, తను చూపించిన ప్రేమ నా కన్నతల్లిని గుర్తుకు తెచ్చింది. యాత్రలో జనం కష్టాలు, బాధలు నేరుగా చూస్తున్నా. నా అనుభవాలను నా తల్లితో ఇలాగే ముచ్చటించేవాడిని. తల్లిని గుర్తుచేసిన గంగవ్వను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను” అని చెప్పి వీడియోను షేర్ చేసుకున్నారు.