హైదరాబాద్లోని మలక్పేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఇద్దరు బాలింతలు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. కల్వకుర్తి కి సిరివెన్నల, సైదాబాద్ కు చెందిన శివాని లు చికిత్స పొందుతూ వైద్యం వికటించి మృత్యువాత పడ్డారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయారని మృతుల బంధువులు ఆరోపిస్తూ.. ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఇద్దరు బాలింతల మరణం అత్యంత దారుణమని.. ప్రభుత్వ నిర్లక్షానికి ఇది పరాకాష్ట అని అన్నారు. హైదరాబాద్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం కనీసం బాలింతలను కాపాడలేకపోతోందన్నారు. ప్రభుత్వ వైద్యంలో తెలంగాణ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని.. ప్రభుత్వ వైఖరి కారణంగానే ఈ రాష్ట్రంలో ప్రైవేట్ వైద్యం అభివృద్ధి చెందుతుందన్నారు.
“ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ అపరేషన్లో ఆపరేషన్ వికటించి నలుగురు బాలింతలు చనిపోయారు. ఆగష్టు చివరి వారంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి బాలింతలు మృత్యువాత పడ్డారు. 4 నెలల్లోనే మళ్ళీ ఈ సంఘటన జరిగింది. హైదరాబాద్ లోనే ఇలా ఉంటే ఇక మారుమూల పల్లెల్లో, అటవీ ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటి.. ప్రభుత్వ ఆసుపత్రులు అంటే ప్రజలకు భయం వేస్తోంది… ప్రపంచ స్థాయి అని చెప్పుకుంటున్న హైదరాబాద్ లో ఇంత ఘోరమా ? ప్రభుత్వ వైద్యం పై పూర్తిగా నమ్మకం పోతోంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాటలకే పరిమితం అయ్యారు. ఈ సంఘటనకు ఆయనే బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలి. మృత్యువాత పడ్డ పేద బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారం అందించాలి” అని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.