జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్.. నిన్న పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులను, జాతీయ నేతను రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఖమ్మం వేదికగా మోదీ వైఖరిన ఎండగడతూ.. రానున్న రోజుల్లో దేశంలో తెలంగాణ మోడల్ ను అమలు చేస్తామని చెప్పారు. అంతా ఓకే కానీ.. ఇటీవల బీఆర్.ఎస్ పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్న కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి.. ఖమ్మం సభకు రాకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఈ క్రమంలోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన విషయాలను మీడియా ముందు బయటపెట్టాడు.
కర్ణాటకలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్న రేవంత్.. ఆ పార్టీకి చెందిన ఓ కీలక నేతను లొంగదీసుకునేందుకు రూ. 500 కోట్లు ఆఫర్ చేశారన్నారు. ఓ సర్వే ప్రకారం.. కర్ణాటకలో కాంగ్రెస్ 130 సీట్లు గెలిచి విజయం సాధిస్తుందని, ఆ సీట్లలో పక్కాగా కాంగ్రెస్ గెలిచే 25–30 స్థానాల్లో( బళ్లారి నుంచి రాయచూరు వరకు) కాంగ్రెస్ పార్టీ పరాజయం కోసం పనిచేయాలని కర్ణాటకకు చెందిన ఓ కీలక నేతకు కేసీఆర్ రూ.500 కోట్లు ఆఫర్ ఇచ్చారన్నారు. ఆ వ్యక్తితో కేసీఆర్.. ఫామ్ హౌస్లో బేరసారాలు సాగించింది నిజం కాదా? అని ప్రశ్నించారు.
ఇది ఆరోపణ కాదని, ఆధారాలతో సహా నిరూపించేందుకు సిద్ధమని చెప్పారు. ఇదంతా కేసీఆర్ పొత్తులో భాగస్వామి అయిన కర్నాటక మాజీ సీఎం కుమారస్వామికి తెలియకుండా జరిగిందన్నారు. దేశంలోని ప్రముఖ జాతీయ నేతలందరికీ సదరు కాంగ్రెస్ కీలకనేతకు రూ. 500 కోట్ల ఆఫర్ ఇచ్చి, బెదిరించిన సంగతి తెలుసన్నారు. అయితే తనకు తెలియకుండా తన రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతతో కేసీఆర్ ఇంత తతంగం నడిపించారన్న.. అసహ్యంతో కుమారస్వామి బీఆర్ఎస్ బహిరంగ సభకు హాజరు కాలేదన్నారు.