టీమిండియా కోచ్ రవిశాస్త్రి జీతం 10 కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

టీమిండియా కోచ్ రవిశాస్త్రి జీతం 10 కోట్లు

September 9, 2019

Ravi Shastri.

ఆటగాళ్లకు రిటైర్మెంట్ వుంటుందేమో గానీ, వాళ్ల సంపాదనకు రిటైర్మెంట్ వుండదేమో. ఆడినన్ని రోజులు ఆడి తర్వాత ఆటను ఇతరులకు నేర్పిస్తూ డబ్బులు సంపాదించుకుంటారు. ఈ నేపథ్యంలో టీమిండియా కోచ్ రవిశాస్త్రి ఏడాదికి ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఏడాదికి ఆయన జీతం రూ. 10 కోట్లు వుందని ముంబయి మిర్రర్ పత్రిక తన కథనంలో పేర్కొంది. 

ప్రపంచకప్ టోర్నమెంట్ తర్వాత టీం ఇండియా ప్రధాన కోచ్ పదవి నుంచి రవిశాస్త్రిని తప్పించి వేరే కోచ్‌ను పెడతారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే బీసీసీఐ మాత్రం రవిశాస్త్రినే ప్రధాన కోచ్‌గా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అతని కాంట్రాక్ట్‌ని 2021 నవంబర్ వరకూ కొనసాగిస్తున్నట్లు స్పష్టంచేసింది. పెరిగిన పదవికాలంతో పాటు శాస్త్రి వేతనాన్ని కూడా భారీగా పెంచినట్లు తెలుస్తోంది. 

శాస్త్రి వార్షిక జీతంని రూ.10 కోట్లుగా చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనకు రూ.8 కోట్లు జీతంగా ఇస్తున్నారు. ప్రధాన కోచ్‌తో పాటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌ల వార్షిక జీతాలు కూడా పెంచినట్లు సమాచారం. బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్‌ల జీతం రూ.3.5 కోట్లకు పెంచగా.. బ్యాటింగ్‌ కోచ్ విక్రమ్ రాథోర్ జీతం రూ.3 కోట్లు చేస్తున్నారని తెలుస్తోంది. కాగా, దీనిపై బీసీసీఐ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.