ఇది నా ల‌వ్‌స్టోరీ..స‌హ‌నానికి ప‌రీక్ష‌ - MicTv.in - Telugu News
mictv telugu

ఇది నా ల‌వ్‌స్టోరీ..స‌హ‌నానికి ప‌రీక్ష‌

February 14, 2018

‘నువ్వే కావాలి’, ‘నువ్వే నువ్వే’, ‘ప్రియ‌మైన‌ నీకు’ చిత్రాల‌తో తెలుగు చిత్ర‌సీమ‌లో ల‌వ‌ర్‌బాయ్‌గా గుర్తింపును సొంతం చేసుకున్నారు త‌రుణ్‌.  ఆ త‌ర్వాత త‌న ఇమేజ్ త‌గ్గ క‌థ‌ల‌ను ఎంచుకోవ‌డంలో పొర‌పాట్లు చేయ‌డంతో విజ‌య‌ప‌రంప‌ర‌ను కొన‌సాగించ‌లేక‌పోయారు. ప‌రాజ‌యాల కార‌ణంగా సినిమాల‌కు దూర‌మ‌య్యారు. దాదాపు నాలుగేళ్ల విరామం త‌ర్వాత తరుణ్ న‌టించిన చిత్రం ‘ఇది నా ల‌వ్‌స్టోరీ’ క‌న్న‌డంలో వంద కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను సాధించిన ‘సింపుల్ అగి ఒంద్ ల‌వ్‌స్టోరీ’ చిత్రానికి రీమేక్ కావ‌డం , త‌న‌కు అచ్చొచ్చిన ప్రేమ‌క‌థతో రూపొంద‌డంతో ఈ సినిమా త‌న‌కు పూర్వ‌వైభ‌వాన్ని తెచ్చ‌ిపెట్ట‌డం ఖాయ‌మ‌ని విశ్వాసాన్ని వ్య‌క్తం చేస్తూ వ‌చ్చారు త‌రుణ్‌. అయితే ద‌ర్శ‌కులు ర‌మేష్‌, గోపి అనుభ‌వ‌లేమి కార‌ణంగా త‌రుణ్‌ ఆశ ఫ‌లించ‌లేదు.

అభిరామ్‌(త‌రుణ్‌) ఓ యాడ్‌ఫిల్మ్ మేక‌ర్‌. కొత్త యాడ్ ఫిల్మ్‌కు సంబంధించి లొకేష‌న్స్ వెత‌క‌డానికి అర‌కు వెళ్తాడు. త‌న సోద‌రి కోరిక మేర‌కు అర‌కులోనే ఉన్న డాక్ట‌ర్ శ్రుతి(ఓవియా) అనే అమ్మాయిని క‌లుస్తాడు. తొలిచూపులోనే ఆమెను ఇష్ట‌ప‌డ‌తాడు. ఒక‌రి గురించి మ‌రొక‌రు తెలుసుకునేందుకు ఒక‌రోజు కలిసి ప్ర‌యాణించాల‌ని వారు నిర్ణ‌యించుకుంటారు. ఈ క్ర‌మంలో మ‌హి అనే అమ్మాయితో త‌న ప్రేమ ఎందుకు విఫ‌ల‌మ‌య్యిందో శ్రుతికి చెబుతాడు అభిరామ్‌. మ‌హి త‌న‌ను మోసం చేసిన ఆమె బాగుండాల‌నే త‌న ప్రేమ‌ను త్యాగం చేస్తాడు. శ్రుతిలోని పెంకిత‌నం, నిజాయితీ న‌చ్చ‌డంతో ఆమెకు త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేయ‌డానికి సిద్ధ‌ప‌డ‌తాడు. కానీ ఆమె శ్రుతి కాద‌నే  నిజం అత‌డికి తెలుస్తుంది. త‌న‌ అస‌లు పేరు అభిన‌య అని చెబుతుంది.  ఆమె కూడా అభిరామ్‌ను ఇష్ట‌ప‌డుతుంది. కానీ త‌రువాతి రోజు అభిరామ్ త‌న‌ను మోసం చేశాడ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తుంది. అస‌లు అభిన‌య ఎందుక‌లా చేసింది? అభిరామ్‌తో ఆమె ఎందుకు అబ‌ద్ధమాడింది? అంతిమంగా వారిద్ద‌రు ఏ విధంగా ఏక‌మ‌య్యార‌న్న‌దే ఈ చిత్ర క‌థ‌.

ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా స్వ‌చ్ఛమైన ప్రేమ జ‌యించి తీరుతుంద‌నే పాయింట్‌తో తెర‌కెక్కిన చిత్ర‌మిది. నాలుగేళ్ల క్రితం క‌న్న‌డంలో విడుద‌లైన సింపుల్ అగి ఒంద్ ల‌వ్‌స్టోరీ ఆధారంగా ద‌ర్శ‌క‌ ద్వ‌యం ర‌మేష్‌ గోపీ ఈ చిత్రాన్ని రూపొందించారు. క‌న్న‌డంలో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు వంద కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను సాధించిన సినిమా కావ‌డంతో త‌రుణ్ ఈ సినిమాపై చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. హీరోగా త‌నకు చ‌క్క‌టి పున‌రాగ‌మ‌నంగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆశించారు. కానీ ద‌ర్శ‌కులు చేసిన పొర‌పాట్ల కార‌ణంగా అత‌డి క‌ల‌లు నెర‌వేర‌లేదు.

మూడు భిన్న ప్రేమ‌క‌థ‌ల స‌మాహారంగా సాగిన ఈ క‌థ‌ను ఆద్యంతం సీరియ‌ల్‌ను త‌ల‌పించేలా న‌డిపించారు ద‌ర్శ‌కులు. అస‌లు వారు ఏం చెప్పాల‌నుకున్నారో, తెర‌పై ఏం చెప్పారో అంతుప‌ట్ట‌దు. రీమేక్ సినిమాను మ‌న నేటివిటీకి అనుగుణంగా చెప్ప‌డంలో ద‌ర్శ‌కులు ఎంతో నేర్పును చూపించాలి. ఆ విష‌యంలో ద‌ర్శ‌కులు పూర్తిగా నిరాశ‌ప‌రిచారు. ప్రేక్ష‌కుడి మ‌న‌సును మెప్పించే స‌న్నివేశాలు, సంభాష‌ణ‌లు ఒక్క‌టీ సినిమాలో క‌నిపించ‌వు. అర‌కులో మొద‌లైన క‌థ అక్క‌డి నుంచి ఎంత‌కూ ముందుకు క‌ద‌ల‌దు. హీరో, హీరోయిన్లు త‌మ‌ విఫ‌ల ప్రేమ గురించి చెబుతున్న స‌న్నివేశాల్లో ఉన్న‌ది కామెడీనో, సెంటిమెంటో తెలియదు. ఆ ప్రేమ‌క‌థ‌ల్లో వ‌చ్చే స‌న్నివేశాల్లో ఒక‌దానికి మ‌రొక‌దానికి లింకు స‌రిగ్గా ఉండ‌దు. త‌మ‌కు తోచింది తీసుకుంటూ వెళ్లిపోయారు.

ప్రాస‌ల‌తో కూడిన సంభాష‌ణ‌ల‌తో త‌మ‌లోని ప్ర‌తిభ‌ను నిరూపించుకోవాల‌నే ద‌ర్శ‌కుల ఉబ‌లాటం ప్రేక్ష‌కుల పాలిట శాపంగా మారింది. క‌థ‌కు సంబంధంలేని అన‌వ‌స‌ర‌పు పంచ్‌ల‌తో సినిమాను నింపేశారు. ఒక‌దాని త‌ర్వాత మ‌రొక‌టి సంబంధం లేకుండా వ‌చ్చే పంచ్‌లు ప్రేక్ష‌కుల్ని ఊపిరి పీల్చుకోనియ్య‌వు. అందులో గుర్తుండిపోయేది ఒక్క‌టి క‌నిపించ‌దు. వీటితో పోలిస్తే డైలీ సీరియ‌ల్స్‌లో వ‌చ్చే సంభాష‌ణ‌లే కొంత న‌య‌మ‌ని అనిపిస్తాయి.

ప‌తాక ఘ‌ట్టాల్లో ఎప్ప‌టిదో  1990ల కాలం నాటి మ‌తిమ‌రుపు డ్రామాతో క‌థ‌ను మ‌లుపు తిప్పాల‌ని చూశారు ద‌ర్శ‌కుడు. అలాంటి క‌థ‌ల‌తో ఇప్ప‌టికే గ‌జినీ, స‌త్య‌భామ, ఇంద్రుడుతో పాటు ద‌క్షిణాదిలో  చాలా సినిమాలు వ‌చ్చాయి.  వాటిలోని ప్ర‌ధాన పాయింట్‌నే తీసుకొని క‌థ‌ను ముగించాడు. అది అంత‌గా ఆక‌ట్టుకోలేదు.

క‌థ, క‌థ‌నాలు ఏవీ లేకుండా సినిమా తీస్తే ఎలా  ఉంటుందో చెప్పుకోవ‌డానికి ఈ సినిమా మంచి ఉదాహ‌ర‌ణగా నిలుస్తుంది. సినిమాను ఎలా మొద‌లుపెట్టాలో, ఎక్క‌డ ముగించాలో తెలియ‌ని అయోమ‌యంలో సినిమాను న‌డిపించిన‌ట్లుగా క‌నిపిస్తుంది. ఎప్పుడు పాట వ‌స్తుందో, త‌ర్వాత ఏం స‌న్నివేశం వ‌స్తుందో అర్థంకాదు.  రెండు ప్ర‌ధాన‌పాత్ర‌ల చుట్టూ తిరిగే క‌థ ఇది. హీరోహీరోయిన్ల మ‌ధ్య  కెమిస్ట్రీ స‌రిగ్గా వ‌ర్క‌వుట్ కాలేదు.క‌నీసం రీమేక్‌లోని ఫీల్ య‌థ‌త‌థంగా చూపించ‌లేక‌పోయారు.

దాదాపు నాలుగేళ్ల విరామం త‌ర్వాత త‌రుణ్ న‌టించిన సినిమా ఇది. రీఎంట్రీ కోసం త‌రుణ్ ఈ క‌థ‌నే ఎందుకు ఎంచుకున్నాడో, ఇందులో అత‌డికి ఏం న‌చ్చిందో అర్థంకాలేదు.  భిన్న పార్శ్వ‌ాల్లో సాగే పాత్ర‌ను త‌న న‌ట‌న‌తో నిల‌బెట్టేప్ర‌య‌త్నం చేశారు. కానీ క‌థ‌నేది లేక‌పోవ‌డం అత‌డి ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. ఏదో సినిమా చేసుకుంటూ వెళ్లిపోయిన‌ట్లే క‌నిపిస్తుంది త‌ప్ప తరుణ్  న‌ట‌న‌లో ఎక్క‌డ మునుప‌టి జోరు క‌నిపించ‌లేదు. క‌థానాయిక‌గా ఓవియా సెలెక్ష‌న్ పూర్తిగా రాంగ్ ఛాయిస్‌.  న‌ట‌న‌, హావ‌భావాలు, గ్లామ‌ర్ అన్నింట్లో నిరాశ‌ప‌రిచింది. తెర‌పై వ‌స్తున్న స‌న్నివేశాల‌కు ఆమె ముఖంలో క‌నిపిస్తున్న హావ‌భావాల‌కు ఎలాంటి సంబంధమూ ఉండ‌దు. కీల‌క‌మైన భావోద్వేగ ప్ర‌ధాన స‌న్నివేశాల్లో పూర్తిగా తేలిపోయింది.

సినిమా చూస్తున్న‌ప్పుడు అస‌లు  ఎడిట‌ర్‌ను తీసుకున్నారా  అనే సందేహం కల‌గ‌క మాన‌దు.  ద‌ర్శ‌కులు తాము తీసిన‌దంతా ప్రేక్ష‌కుల‌కు చూపించిన భావ‌న క‌లుగుతుంది. క‌థ‌కు సంబంధంలేని స‌న్నివేశాలే ఎక్కువ‌గా ఉన్నాయి. సంగీతం, నిర్మాణ విలువ‌ల  ఏదీ బాగాలేదు. ఉన్నంత‌లో కెమెరామెన్ క్రిస్టోఫ‌ర్ జోసెఫ్ ఒక్క‌డే తాను తీసుకున్న పారితోషికానికి న్యాయం చేశారు.

ఈ సినిమాతో త‌రుణ్ మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌స్తాడ‌ని, పూర్వ‌వైభ‌వాన్ని సొంతం చేసుకుంటాడ‌ని చిన్న న‌మ్మ‌కంతో థియేట‌ర్‌లో అడుగుపెట్టిన ప్రేక్ష‌కుల‌కు క‌థ‌ మొద‌లైన‌ ప‌దినిమిషాల‌కే  అది సాధ్యం కాద‌నే క్లారిటీ వ‌చ్చేస్తుంది. థియేట‌ర్ నుంచి ఎప్పుడు బ‌య‌ట‌ప‌డ‌తామో అని ఎదురుచూపులే వారికి మిగులుతాయి. క‌థ‌ల  ఎంపిక‌లో గ‌తంలో చేసిన త‌ప్పుల‌నే మ‌రొసారి పున‌రావృతం చేసిన త‌రుణ్ వ‌చ్చిన ఒక్క అవ‌కాశాన్ని వృథా చేసుకున్నారు.

రేటింగ్‌:1.5/5