నవ్వించే కన్ఫ్యూజన్    - MicTv.in - Telugu News
mictv telugu

నవ్వించే కన్ఫ్యూజన్   

November 24, 2017

ఒకప్పుడు కొత్తవారు దర్శకులు కావాలంటే ఎన్నో ఏళ్ల పాటు సహాయకుడిగా అనుభవాన్ని గడిస్తేగానీ అవకాశం దక్కేది కాదు. కానీ సోషల్‌ మీడియా పుణ్యమా అని నవతరం యువత  కలలు కనే వయసులోనే దర్శకులుగా మారిపోతున్నారు.  లఘు చిత్రాలను తెరకెక్కించి వాటి ద్వారా వచ్చిన పాపులారిటీతో దర్శకులుగా అవకాశాల్ని అందిపుచ్చుకుంటున్నారు. తరుణ్‌ భాస్కర్, సుజీత్, శ్రీరామ్‌ ఆదిత్య ఇలా నవతరం దర్శకుల్లో అధిక శాతం లఘు చిత్రాల ద్వారా ప్రతిభను నిరూపించుకుని వెండితెరపై డుగుపెట్టారు. పంచ్ డైలాగ్‌లు, హీరోయిజాలు, భారీ పోరాటాలు, చేజింగ్స్‌లతో కూడిన కథను సిద్ధం చేసుకుని తొలి సినిమాతోనే మాస్ దర్శకుడిగాగుర్తింపును తెచ్చుకోవాలని తాపత్రయ పడకుండా సహజత్వంతో కూడిన వినోదభరిత కథాంశాలకు ప్రాధాన్యమివ్వడంతో లఘు చిత్రాల దర్శకులు విజయాల్ని అందుకున్నారు. ‘మెంటల్‌ మదిలో’ చిత్రంతో వివేక్ ఆత్రేయ ఆ పంథానే అనుసరించారు. లఘు చిత్రాలతో ఇప్పటికే మంచి గుర్తింపును సొంతం చేసుకున్న అతడు ఈ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టాడు. కన్య్ఫూజన్ కామెడీ అనే కొత్త పాయింట్‌ను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు.

గత ఏడాది విడుదలైన పెళ్లిచూపులు చిత్రం చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని సాధించింది. రెండు జాతీయ పురస్కారాల్ని కైవసం చేసుకున్న ఈ చిత్రం చిన్న సినిమాలకు  కొత్త ఊపిరి పోసింది. నిర్మాతగా రాజ్‌కందుకూరికి ఎనలేని పేరుప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టింది. పెళ్లిచూపులు  తర్వాత రాజ్ కందుకూరి సంస్థ నుంచి వస్తున్న సినిమా కావడంతో మెంటల్‌మదిలో పట్ల అందరిలో ఆసక్తి మొదలైంది. తప్పకుండా ఏదో కొత్తదనం ఉండి తీరుతుందనే నమ్మకంతో ఎదురుచూశారు.

అరవింద్‌కృష్ణకు(శ్రీవిష్ణు) చిన్నతనం నుంచి కన్య్ఫూజన్ ఎక్కువ. ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలనే దాని నుంచి మొదలుపెడితే పరీక్షల్లో అబ్జెక్టివ్ ప్రశ్నలకు సమాధానాలు రాయడం వరకు ఆప్షన్స్ ఉన్న ప్రతి దాంట్లో దేనిని ఎంచుకోవాలో తెలియక తికమత పడుతుంటాడు. అలాగే అమ్మాయిలంటే ఆమడదూరం పారిపోతాడు. కనీసం వారితో ఒక్క మాటైనా మాట్లాడడు. అరవింద్‌కృష్ణకు పెళ్లిచేయాలని తండ్రి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీపెళ్లిచూపుల్లో అమ్మాయిలతో మాట్లాడటానికి అరవింద్ భయపడటంతో వారు అతడిని తిరస్కరిస్తుంటారు. వయసు పెరుగుతుండటంతో  అతడికి పెళ్లి అవుతుందో లేదో అని కుటుంబసభ్యులు ఆందోళన పడుతుంటారు. ఈ క్రమంలో స్వేచ్ఛ అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు అరవింద్. ఆమెకూడా అతడిని పెళ్లిచేసుకోవడానికి అంగీకరిస్తుంది. ఆరవింద్‌కు భిన్నమైన మనస్తత్వం స్వేచ్ఛది. ఆత్మవిశ్వాసం ఎక్కువ. అంతా సవ్యంగా జరుగుతున్న తరుణంలో  స్వేచ్ఛ నానమ్మ చనిపోవడంతో వారి పెళ్లి ఆగిపోతుంది. ఇదే సమయంలో అరవింద్ కృష్ణకు ముంబై బదిలీ అవుతుంది. అక్కడ అరవింద్ జీవితంలోకి రేణు ప్రవేశిస్తుంది. అమ్మాయిల్లో తనుకోరుకునే లక్షణాలన్ని స్వేచ్ఛలో కనిపించడంతో తొందరలోనే ఆమెతో ప్రేమలో పడతాడు. దాంతో స్వేచ్ఛ, రేణులలో ఎవరితో జీవితాన్ని పంచుకోవాలో తెలియక సంశయంలో పడిపోతాడు. కీలకమైన సందర్భంలో అరవింద్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు?ఆ సమస్య నుంచి ఎలా భయపట్టాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.

సంశయం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో అందరూ ఈ సమస్యను ఎదుర్కొంటారు. అలాంటి కామన్ పాయింట్‌ను ప్రధానంగా చేసుకొని  దర్శకుడు వివేక్ ఆత్రేయ సినిమాను తెరకెక్కించారు. ఊహించని మలుపులు, గుండెల్ని పిండే సెటిమెంట్ అంశాలకు తావు లేకుండా ఆద్యంతం వినోదభరితంగా తెరకెక్కించడంలో దర్శకుడు చాలా వరకు విజయవంతమయ్యారు. శ్రీవిష్ణు కన్య్ఫూజన్ కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. శివాజీరాజా, శ్రీవిష్ణు మధ్య సన్నివేశాల్ని సరదాగా మలచిన తీరు ఆకట్టుకుంటుంది. బలవంతపు కామెడీ ట్రాక్‌లతో నవ్వించే ప్రయత్నాలు చేయకుండా కథానుగుణంగానే కామెడీని పండించిన తీరు బాగుంది.

ప్రథమార్థాన్ని చకచక నడిపించిన వివేక్ ఆత్రేయ ద్వితీయార్ధం పట్టాలు తప్పారు. కథాగమనంలో వేగం మందగించింది. అనవసరపు సన్నివేశాలతో టైమ్‌పాస్ చేశారు. కామెడీపరంగా సెకండాఫ్‌లో లోటు కనిపిస్తుంది. పతాక ఘట్టాలతో కథ మళ్లీ ఆసక్తికరంగా మారుతుంది. ప్రధాన పాత్రల మధ్య ఉన్న భావోద్వేగాల్ని మరింత బలంగా ఆవిష్కరిస్తే సినిమా మరో స్థాయిలో ఉండేది. చిన్న చిన్న లోపాలు మినహా దర్శకుడు తొలిప్రయత్నంలోనే ప్రతిభను చాటుకున్నాడు. సినిమాటిక్ అనుభూతికి దూరంగా సహజత్వానికి ప్రాధాన్యతనిస్తూ  అందంగా మలిచారు. పక్కింట్లో జరుగుతున్న కథలా అనిపిస్తుంది. ఎంచుకున్న లొకేషన్స్, పాత్రలు అన్నినిత్యజీవితంలో మనకు పరిచయమున్న భావన కలిగించేలా తీర్చిదిద్దిన తీరు బాగుంది.

మెంటల్ మదిలో రూపంలో సోలో హీరోగా శ్రీవిష్ణుకు మంచి సినిమా దొరికింది. గత సినిమాలతో పోలిస్తే నటుడిగా మెరుగయ్యారు. కన్య్ఫూజన్ కుర్రాడిగా చక్కటి నటనను కనబరిచారు. ఎమోషనల్ సన్నివేశాల్నిపడించడంలో మరింత పరిణితి రావాలి. నివేతా పెతురాజ్ తొలి సినిమా అయినా తన సహజఅభినయంతో  ఆకట్టుకుంటుంది. స్వేచ్ఛ పాత్రకు ప్రాణం పోసింది. కళ్లు, హావభావాలతో పాత్రను రక్తికట్టించింది. రేణు పాత్రధారిపర్వాలేదనిపిస్తుంది. శివాజీరాజాకు చాలా రోజుల తర్వాత ఓ మంచి పాత్ర దొరికింది. శ్రీవిష్ణు తండ్రిగా అతడి నటన గుర్తుండిపోతుంది.

చిన్న సినిమా అయినా సాంకేతికంగా పెద్ద సినిమాలను తలపిస్తుంది. ప్రశాంత్‌ విహారి బాణీలు, నేపథ్య సంగీతం కథానుగుణంగా అద్భుతంగా కుదిరాయి. ఛాయాగ్రహకుడు వేదరామన్ పాటలతో పాటు ముంబాయి, గోవా  నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్ని కలర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు.

అహ్లాదభరిత ప్రయాణంలా అందంగా సాగిపోయే చిత్రమిది. అశ్లీలత, అసభ్యతకు తావు లేకుండా క్లీన్‌లవ్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు సినిమాను తెరకెక్కించిన తీరు అభినందనీయం. పెళ్లిచూపులు స్థాయిలో నిలిచే చిత్రంకాకపోయినా మంచి ప్రయత్నంగా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది.

రేటింగ్:3/5