review on Todelu movie
mictv telugu

గీతా ఆర్ట్స్ మళ్ళీ హిట్ కొట్టిందా?

November 25, 2022

review on Todelu movie,

అల్లు అరవింద్….ఇతని గురించి తెలియని వారు ఎవరు ఉండరు. తెలుగు ఇండస్ట్రీకి మెయిన్ పిల్లర్. ఇతను సంపాదించినన్ని డబ్బులు ఎవ్వరూ సంపాదించి ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. తెలుగు సినిమాలకు నిర్మాతగా అల్లు సాధించిన సక్సెస్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు డబ్బింగ్ సినిమాలతో అల్లు కత మరో రేంజ్ లో ఉంది. మొన్న కాంతారా, ఇవాళ తోడేలుతో అల్లు నిర్మాణ సంస్థ కాసులు పంట పండిస్తోంది. సైలెంట్ గా వచ్చిన కాంతారా ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. మన తెలుగు సినిమాలను కూడా తోసిరాజనేసి రికార్డులను బద్దలుకొట్టేసింది కాంతారా. ఒరిజినల్ భాషలో ఎంతలా హిట్ అయిందో డబ్బింగ్ లో అంతకంటే పెద్ద హిట్ అయింది. ఇప్పడు తోడేలు వంతు.

బాలీవుడ్ నుంచి వచ్చిన సినిమా తోడేలు. వరుణ్ ధావన్ హీరోగా చేసిన ఈ సినిమా నిన్న విడుదల అయింది. అల్లు నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ హిందీ మూవీ భేడియాను తోడేలుగా డబ్బింగ్ చేసి విడుదల చేసింది. ఈ సినిమాకు మంచి రివ్యూస్ వస్తున్నాయి. కథలో కొత్తదనం లేకపోయినా విజువల్ వండర్ తో అదరగొట్టిందని చెబుతున్నారు చూసినవాళ్ళు. మామూలుగానే వరుణ్ థావన్ రెగ్యులర్ సినిమాలు చేయకుండా కొంత వెరైటీ కథలను ఎన్నుకుంటుంటాడు. యాక్టింగ్ కూడా బాగా చేస్తాడని పేరు ఉంది. అయితే తోడేలు సినిమాలో వరుణ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ ఉంది అంటున్నారు ప్రేక్షకులు. మనిషిగా, తోడేలుగా వరుణ్ చించేసాడని చెబుతున్నారు.

ఇండియన్ స్క్రీన్ మీద తొలి క్రియేచర్ కామెడీ జానర్ మూవీ ‘తోడేలు’.దర్శకుడు అమర్ కౌశిక్. ఈ అత్యున్నత సాంకేతిక విలువలతో హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్‌తో ఈ సినిమా ఉందిట. గన్ మెర్విక్, గాడ్జిలా వెర్సస్ కింగ్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ చిత్రానికి గ్రాఫిక్స్ వర్క్ అందివ్వడం ప్లస్ పాయింట్. మనిషి తోడేలుగా మారడం, అడవి, అడవిలో పున్నమి వీటన్నింటినీ చాలా సహజంగా, ఒళ్ళుగగుర్పొడిచే విధంగా చూపించారుట ఇందులో. మనిషి నుంచి తోడేలుగా మారడం అనేది చాలా భయానకంగా ఉంటుంది. ఒక్కో భాగం మారుతున్న తీరు.. తోడేలు ఎక్స్ ప్రెషన్స్.. నిజమైన తోడేలు ఇలాగే ఉంటుందా? అన్నంత నేచురాలిటీ తీసుకునివచ్చారు. vfx 3D టెక్నాలజీలో తోడేలు చూస్తుంటే ఏదో కొత్త ప్రపంచంలో ఉన్నట్టు ఉంటుందిట. తోడేలు దూకేటప్పుడు.. అరిచేటప్పుడు.. ఇలా చాలా సందర్భాల్లో మంచి విజువల్ ట్రీట్ కలుగుతుంది.

తోడేలు విజువల్ ట్రీట్.. థ్రిల్లింగ్ అండ్ యాక్షన్ ఎపిసోడ్‌లతో పాటు కడుపుబ్బా నవ్వుకోవడానికి మంచి కామెడీ కూడా ఉంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. చూస్తే 3Dలోనే చూడాలి.. లేదంటే ఆ విజువల్ ట్రీట్‌లో ఉన్న బ్యూటీ మిస్ అవుతుంది. కథలో కొత్తదనం కోరుకునేవారికి ‘తోడేలు’ పెద్దగా నచ్చకపోవచ్చు కానీ.. విజువల్ ట్రీట్ ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకునేవాళ్లని మాత్రం ‘తోడేలు’ సర్ ప్రైజ్ చేస్తుంది.

ఇక కథ విషయానికి వస్తే….ప్రభుత్వ కాంట్రాక్టర్ అయిన భాస్కర్ (వరుణ్ ధావన్) అరుణాచల్ ప్రదేశ్‌లోని ఓ దట్టమైన అటవీ ప్రాంతంలో రోడ్డు వేసే కాంట్రాక్టు దక్కించుకుంటాడు. దానిలో భాగంగా అక్కడ అడవుల్ని నరికి.. అక్కడ జీవనం సాగిస్తున్న ఆదివాసులు నుంచి ల్యాండ్ పూలింగ్ చేయాలని అక్కడికి వెళ్తాడు. నాగరికతకు దూరంగా ఉన్న వాళ్ళని మోసం చేసి స్థలాలను తీసుకోవడానికి చూస్తాడు. అయితే ఇతని ప్రయత్నానికి అడ్డుకట్ట వేస్తుంది ఓ తోడేలు. అడవిలో తిరుగుతున్నప్పుడు ఒక తోడేలు భాస్కర్‌ మీద దాడి చేస్తుంది. అప్పడు అది అతన్ని కరుస్తుంది. అప్పటి నుంచి భాస్కర్‌లో మార్పులు మొదలౌతాయి. అతను రాత్రి అయ్యేసరికి తోడేలుగా మారతాడు. అడవిని నాశనం చేయాలనుకునే వాళ్ళ పాలిట హంటర్‌గా మారతాడు. పగలు భాస్కర్‌గా.. రాత్రి అయ్యేసరికి తోడేలుగా.. అతని జీవితం ఒక్కసారిగా తలకిందులు అవుతుంది. మరి భాస్కర్‌ తిరిగి మనిషిగా మారాడా? అసలు అతన్ని తోడేలుగా మార్చిందెవరు? ఎందుకు? అన్నదే సినిమా కథ. ఇందులో బోలెడు ట్విస్ట్ లు, ఇంట్రస్టింగ్ సన్నివేశాలు ఉన్నాయి. వాటిన్నంటినీ తెర మీద చూడాల్సిందే.

ఆకారం మారుతూ తోడేలుగా మారే సన్నివేశంలో వరుణ్ ధావన్ అద్భుతంగా నటించాడు. కండరాలను చీల్చుకుంటూ తోడేలు బయటకు రావడంతో.. శరీరభాగాలు ఒక్కొక్కటిగా మారడం.. అతీత శక్తులు.. వాసన పసిగట్టటం.. చిన్న చిన్న శబ్ధాలు కూడా వినబడటం.. కాళ్ళు, చేతులతో నడవడం.. ఒక శాకాహారి నరమాంసం తింటూ వాళ్ల రక్తం తాగి.. తెల్లారేసరికి మళ్ళీ మనిషిలా మారి నొప్పితో బాధపడే సన్నివేశాల్లో జీవించేశాడు. తన శరీరంలో జరిగే మార్పులకు రకరకాల వేరియేషన్స్ చూపిస్తూ అద్భుతంగా నటించాడు వరుణ్. తన భీకర నటనతో భయపెట్టేశాడు.. మరి కొన్ని సన్నివేశాల్లో అయ్యో పాపం అని జాలిపడేట్టు చేశాడు. నటనలో అన్ని షేడ్స్ చూపించేశాడు వరుణ్. ముఖ్యంగా అడవిలో తన చెడ్డీలో నుంచి పాము దూరి బయటకు వచ్చే సన్నివేశంలో అయితే ఒళ్లు గగుర్పొడుస్తుంది.

ఇక భాస్కర్ ఫ్రెండ్ జెతి‌గా అభిషేక్ బెనర్జీ (abhishek banerjee) తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. ఈ సినిమాలో కామెడీ పార్ట్ మొత్తాన్ని భుజాన వేసుకున్నాడు. రోమాలు నిక్కబొడుచుకునే యాక్షన్ సన్నివేషాల్లో సైతం ప్రేక్షకుడి ముఖంపై చిరునవ్వు ఉండేట్టు చేశాడు. పిర్రపై తోడేలు కరిచే సీన్‌లో.. హీరో మలాన్ని టెస్ట్ కోసం సేకరించే సన్నివేశాలల్లో తన కామిక్ టైమింగ్‌తో పొట్టచెక్కలు చేశాడు. హీరోకి స్నేహితుడిగానే కాకుండా.. ఫ్యామిలీ రిలేషన్ ఉన్న పాత్రలో కామెడీ పంచాడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ ఎక్కడా తన కామెడీ టైమింగ్ కోల్పోలేదు. ఇంకా చెప్పాలంటే హీరోయిన్ కంటే కూడా స్క్రీన్‌పై ఎక్కువ కనిపించేది ఇతనే.

హీరోకి మరో స్నేహితుడు జోమిన్ (పాలిక్ కబక్- Paalin Kabak) ఇతనికి కూడా కథలో కీలక పాత్ర. భాస్కర్, జోమిన్, జేడీ ఈ ముగ్గురుతోనే ‘తోడేలు’ కథ ముందుకు సాగుతుంది. తమ స్నేహితుడు జంతువుగా మారిన మనిషని తెలిసి కూడా.. అతనితో స్నేహం చేసి అతన్ని మామాలు మనిషిగా మార్చుకోవలన్న తపనను వాళ్ల నటనలో చూపించారు జోమిన్, జేడీ. ఈ ముగ్గురి కాంబోలో సీన్లు కామెడీగానే కాకుండా యాక్షన్, ఎమోషన‌ల్‌గా బాగా పండాయి. జోమిన్, జేడీల ముందే భాస్కర్.. తోడేలుగా మారడం.. వాళ్లనే తినేయడానికి వచ్చే సీన్‌లో జోమిన్, జేడీలు తమ నటనతో అబ్బురపరిచారు. ఓ వైపు నవ్విస్తూనే.. మరోవైపు వీళ్లు పోతే ఎలారా బాబూ అనేంత అమాయకంగా కనిపించి ప్రేక్షకుడు కథలో ఇన్వాల్వ్ అయ్యేట్టు చేశారు.

డాక్టర్ అనిక పాత్రలో కృతి సనన్ (Kriti Sanon) నటించింది. వెటర్నరీ డాక్టర్ గా కృతి సనన్ క్యారెక్టర్ బాగున్నా ఇంకా బావుండొచ్చు అనిపించింది. ఆమెను పరిచయం చేసిన సీన్ చాలా బావుంది.. ఈమెనే హీరోయిన్ అనేట్టుగా ఉంది. కృతి సనన్ హీరోని అడవిలోకి తీసుకుని వెళ్లి.. అక్కడ అడవి అందాలను చూపించే సీన్ హైలైట్. దర్శకుడు అక్కడొక ప్రపంచాన్నే సృష్టించినట్టు అనిపిస్తుంది. అంత నేచురల్‌గా అడవి అందాలను చూపించారు. కానీ బ్యూటీ ముందు హీరోయిన్ బ్యూటీ తేలిపోయింది పాపం. అందుకే కృతి స్క్రీన్‌పై పెద్దగా హైలైట్ కాలేదు. ఇందులో కృతి పశువుల డాక్టర్ గానే ఉంచేయకుండా…ప్రేక్షకుల ఊహకి అందని ట్విస్ట్‌తో ఆమె పాత్రకు సెకండాఫ్‌లో మంచి హైప్ ఇచ్చారు. అయితే ఆమె పాత్రను ముందే పసిగట్టే ప్రేక్షకులకైతే ఈ ట్విస్ట్ పెద్దగా కిక్ ఇవ్వకపోవచ్చు.

కథ ఏం జరుగుతుంది.. తరువాత ఏం జరగబోతుంది.. క్లైమాక్స్ ఏంటన్నది ముందే తెలిసిపోతూ ఉండటం.. ఈ సినిమాకి మైనస్. కానీ విజువల్ ట్రీట్‌తో ఫస్టాఫ్ చాలా గ్రిప్పింగ్‌గా ఉండడం వల్ల ఇది కవర్ అయిపోయింది. ఇంటర్‌వెల్ బ్యాంగ్ లో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. భాస్కర్ తోడేలుగా మారే సన్నివేశంతో సెకండాఫ్‌లో ఆసక్తిపెంచేశాడు. తరువాత ఏం జరుగుతుందనే ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేట్టు చేశారు. కానీ సెకండాఫ్‌ని ఊహకందే అంశాలతో సాగదీసినట్టు అనిపిస్తుంది. తెరపై మనకి అద్భుతమైన ప్రపంచం కనిపిస్తున్నప్పకీ.. సెకండాఫ్‌తో పాటు క్లైమాక్స్ కూడా తేలిపోయినట్టు అనిపిస్తుంది.

మొత్తానికి కథ, కథనం విషయంలో మైనస్ పాయింట్లు ఉన్నప్పటికీ యాక్టర్స్ నటన, గ్రాఫిక్స్ వీటితో అవన్నీ మరుగున పడిపోయేలా చేశారు. రెగ్యులర్ సినిమాలు చూసి బోర్ కొట్టిన జనాలకు ఇది బాగా నచ్చుతుందనే చెప్పాలి. పైసా వసూల్ సినిమా ఇది అంటున్నారు థియేటర్ నుంచి బయటనకు వచ్చిన ప్రేక్షకులు.