ఆర్ధికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీయేతర వర్గాలకు ఈడబ్ల్యూఎస్ పేరిట పది శాతం రిజర్వేషన్ అమలవుతున్న విషయం తెలిసిందే. దీని కోసం కేంద్ర ప్రభుత్వం 103వ రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ 15(6), 16,(6) లను రాజ్యాంగంలో చేర్చింది. వీటి ప్రకారం విద్యాసంస్థలు, ఉద్యోగ నియామకాల్లో ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తారు. కుటుంబ ఆదాయం గరిష్టంగా రూ. 8 లక్షలకు మించకూడదు. అయితే ఆర్ధిక అంశాలను ప్రాతిపదికగా తీసుకొని తెచ్చిన ఈ రిజర్వేషన్ చెల్లుబాటుపై సుప్రీంలో కేసు దాఖలవగా, ధర్మాసనం 3-2 మెజారిటీతో రిజర్వేషన్లను సమర్ధించింది. అయితే ఈ తీర్పు రిజర్వేషన్లు 50 శాతం దాటరాదనే తీర్పును ఉల్లంఘించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. 1992లో ఇందిరా సహానీ కేసులో అసాధారణ పరిస్థితుల్లో తప్ప ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటరాదని 9 మందితో కూడిన విస్తృత ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో ఆ కోటా దాటుతున్నందున ఇప్పుడు ఈ తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలైంది. పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా (డెమొక్రటిక్) తరపున న్యాయవాది అజిత్ కుమార్ ఎక్కా పిటిషన్ దాఖలు చేశారు. మరి ఈ రివ్యూ పిటిషన్ పై సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.