గొర్రెల కోసమా తెలంగాణ తెచ్చుకున్నది! - MicTv.in - Telugu News
mictv telugu

గొర్రెల కోసమా తెలంగాణ తెచ్చుకున్నది!

October 30, 2017

‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నది గొర్రెలు, బర్రెలు, బతుకమ్మ చీరల కోసమా? వాటిని ఆంధ్రా పాలకులు ఇవ్వలేరా? కేసీఆర్ తెలంగాణ ప్రజల కష్టాలను పట్టించుకోకుండా విలాసవంతంగా బతుకుతున్నారు. ఫాం హౌస్ కట్టుకుని, వేల కోట్ల వ్యాపారాలు చేసుకుంటున్నారు… ప్ర‌జ‌ల త్యాగాలతో ఏర్ప‌డ్డ తెలంగాణ‌ను త‌న కుటుంబ ప్ర‌యోజ‌నాల‌కు వాడుకుని విలాస‌వంత‌మైన జీవితాన్ని అనుభ‌విస్తున్నారు.. తెలంగాణ రాక ముందు కేసీఆర్ ఏం చెప్పారు? ఇప్పడేం చేస్తున్నారు?’ అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో తన నివాసంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మాట్టాడారు. కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కూడా హాజరయ్యారు.

ఏపీని చంద్రబాబు అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తోంటే కేసీఆర్ తెలంగాణను అధోగతికి తీసుకెళ్తున్నారని రేవంత్ ధ్వజమెత్రు.  తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నేత‌లు కుమ్మక్కయ్యారని విమర్శించారు. బీజేపీ, ఎంఐఎంలతో టీఆర్ఎస్‌ లోపాయకారీ ఒప్పందాలు చేసుకుందని ఆరోపించారు. టీఆర్ఎస్.. నోట్ల రద్దుకు, జీఎస్టీకి మద్దతిచ్చిందని మండిపడ్డారు.

‘వేల మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పడింది. హామీలు నమ్మి జనం టీఆర్‌ఎస్‌కు అధికారమిచ్చారు. ఇచ్చిన ఒక్క హామీని కూడా కేసీఆర్‌ నెరవేర్చడం లేదు. కేసీఆర్ కేవలం కుటుంబ ప్రయోజనాల కోసమే తాపత్రయపడుతున్నారు. 14 ఏళ్ల ఉద్యమకాలంలో ఏమేం చెప్పారు.. అధికారంలోకి వచ్చిన 40 నెలల్లో ఏమేం చేశారు? అని! సామాజిక తెలంగాణ జాడ లేకుండా పోయింది. ప్రతిపక్షాల గొంతునొక్కడం కేసీఆర్‌కు అలవాటైంది. ఇకపై ఇది సాగదు’ అని అన్నారు.