వరవరరావుకు తీవ్ర అస్వస్థత.. జైలు నుంచి ఆస్పత్రికి తరలింపు - MicTv.in - Telugu News
mictv telugu

వరవరరావుకు తీవ్ర అస్వస్థత.. జైలు నుంచి ఆస్పత్రికి తరలింపు

May 29, 2020

Varavara Rao.

విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు(80) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముంబైలోని తలోజా జైలులో ఉన్న ఆయన మే 29 (శుక్రవారం) అస్వస్థతకు గురైనట్లు జైలు అధికారులు వెల్లడించారు. వెంటనే ఆయనను నవీ ముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించినట్టు ముంబై పోలీసులు చిక్కడపల్లి పోలీసుస్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వరవరరావు అనారోగ్య పరిస్థితి దృష్యా ఆయనను కలుసుకునేందుకు గాను కుటుంబ సభ్యులు ముంబయి వెళ్ళేందుకు అనుమతించినట్టు హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. వరవరరావు కుటుంబసభ్యుల ప్రయాణ ఏర్పాట్ల గురించి ప్రత్యేకంగా  ఒక డీసీపీ చూసుకుంటున్నట్టు కమిషనర్ చెప్పారు. 

వరవరరావును ఉంచిన జైల్లోని కొందరు ఖైదీలు కరోనా వైరస్ బారిన పడ్డట్లు తెలియడంతో ఇప్పటికే కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారిలో ఒక ఖైదీ మరణించినట్టు కూడా మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో తమ తండ్రిని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని వరవరరావుయ ముగ్గురు కుమార్తెలు సహజ, అనల, పవన మహారాష్ట్ర గవర్నర్‌కు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశారు. కాగా, ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలు, ఎల్గార్‌ పరిషద్‌ – మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో వరవరరావును అరెస్ట్ చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే.