మెగా ఫ్యామిలీని ఆర్జీవీ వదిలేలాలేడు కదా.. మరో సినిమా ప్రకటన  - MicTv.in - Telugu News
mictv telugu

మెగా ఫ్యామిలీని ఆర్జీవీ వదిలేలాలేడు కదా.. మరో సినిమా ప్రకటన 

August 2, 2020

RGV Announces Allu Movie .

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఆయన ఏ సినిమా తీస్తానని ప్రకటించినా వివాదం కాకుండా ఉండదు. అయితే లాక్‌డౌన్ తర్వాత డిజిటల్ మార్కెట్లోకి వచ్చిన ఆర్జీవీ తన పైత్యానికి మరింత పదును పెడుతున్నాడు. ఇబ్బడిముబ్బడిగా సినిమా పేర్లను ప్రకటించేస్తున్నాడు. ఎలాంటి సెన్సార్లు లేకపోవడంతో తెలివిగా టార్గెట్ చేసుకుంటూ సినిమాలు తీస్తున్నాడు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీపైనే ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తోంది. తాజాగా ఆయన మరో బాంబు పేల్చాడు. తన తదుపరి సినిమా పేరును ప్రకటించి మరోసారి సంచలనం రేపాడు. 

‘అల్లు’ అనే ఫిక్షనల్ సినిమాను తాను తెరకెక్కిస్తానని ట్వీట్ చేశాడు. ఓ స్టార్ హీరో కుటుంబం కోసం అతడి బామ్మర్ది ఏం చేశాడో దాంట్లో చూపిస్తానని పేర్కొన్నాడు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర రకరకాల కథలను అల్లుతాడని, అందుకే ఆ పేరు పెట్టానని చెప్పుకొచ్చాడు. అయితే ‘జనరాజ్యం’ పార్టీ స్థాపనతో ఈ కథ మొదలవుతుందని తెలిపాడు. అందరితో తనని ఆహా అనిపించుకోవటానికి తనకి కావాల్సిన వాళ్ళకే మంచి జరిగేలా అల్లుకుపోతూ ఉండే ఒక పెద్ద అల్లికల మాస్టర్ కథే ఈ  ‘అల్లు’.అంటూ రివీల్ చేశాడు. ఈ సినిమాలో ఎ.అరవింద్‌, కె.చిరంజీవి, పవన్ కల్యాణ్‌, ఎ.అర్జున్‌, ఎ.శిరీష్‌, కె.ఆర్‌.చరణ్‌, ఎన్.బాబు పాత్రలు కూడా ఉంటాయని చెప్పేయడంతో ఇక ఇది అల్లు ఫ్యామిలీపై సినిమా అని అంతా చర్చించుకుంటున్నారు.