అంబర్‌పేట కుక్కల దాడిలో చనిపోయిన నాలుగేళ్ల బాలుడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు రావడంతో హుటాహుటిన స్పందించి స్టెరిలైజ్ కార్యక్రమం చేపట్టింది. ఇంతలో రంగంలోకి జంతు ప్రేమికులు ఎంటరయ్యారు. దీంతో నెటిజన్లు వీరిని ఒక ఆట ఆడుకున్నారు. ఇంతలో కాంట్రవర్సీ కింగ్ ఆర్జీవీ ఊహించిన విధంగానే ఎంట్రీ ఇచ్చాడు. మేయర్ విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలపై సెటైరికల్ కౌంటర్ ఇచ్చారు.
అయితే ఈ విషయంపై ఆర్జీవీ మరోసారి ఫోకస్ పెట్టడం మొదలెట్టాడు. ప్రభుత్వానికి సీరియస్‌గా ఐదు ప్రశ్నలు వేసి ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాడు. నెటిజన్లు కూడా ఒత్తిడి తేవాలని ప్రదీప్ లాంటి మరో చిన్నారి బలికాకముందే తన ఒక్కో ప్రశ్నకు సమాధానం వచ్చే వరకు విడిచిపెట్టవద్దంటూ పిలుపు ఇచ్చాడు.
1. జనాలు సురక్షితంగా బయట తిరగడానికి ప్రభుత్వం తీసుకుంటున్న తక్షణ చర్యలేంటి? మా మధ్య మేం చర్చిస్తున్నాం అనడం సమాధానం కానే కాదు. ఎందుకంటే బయట జనాలను కుక్కలు పీక్కుతింటున్నాయి.
2. కుక్కల సంరక్షణే ముఖ్యం అనుకుంటే అన్ని వీధికుక్కలను పట్టుకుని డాగ్ షెల్టర్‌లకు తీసుకెళ్లడం కంటే వాటిని దత్తత తీసుకునే ప్రక్రియ స్టార్ట్ చేస్తే సరిపోతుంది. వీధి కుక్కలను దత్తత తీసుకోవాలని ప్రజలను కోరడం మూర్ఖత్వపు పని.
3. 4 లక్షలకు పైగా ఉన్న వీధికుక్కలను చూసుకోవడానికి ప్రభుత్వం దగ్గర వనరులు లేకుంటే కుక్కల ప్రేమికులు ఎందుకని పన్నుల రూపంలో డబ్బు చెల్లించకూడదు
4. స్టెరిలైజేషన్ ప్రక్రియ దీర్ఘకాలికమైనది. ఫలితాలు కూడా ఆలస్యంగా వస్తాయి. కానీ మేం మాట్లాడుతున్నది ప్రస్తుతం మనుషులను చంపుతున్న కుక్కల సంగతేంటీ అని
5. చనిపోయిన బాలుడి కుటుంబానికి ఎంత పరిహారం ఇవ్వబోతోంది? వారి మానసిక క్షోభకు ఎంత వెల కడతారు? మేయర్ గద్వాల విజయలక్ష్మి వంటి బాధ్యత కలిగిన ప్రముఖులు వ్యక్తిగతంగా ఇంకెంత నగదు సాయం చేయబోతున్నారు?
పై ప్రశ్నలతో పాటు బాలుడి మరణంపై కావేటి శ్రీనివాస్ అనే వ్యక్తి జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖ, కేంద్ర ప్రభుత్వంపై దావా వేస్తున్నట్టు తెలిపారు. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును ఉల్లంఘించినందుకు, నేరపూరిత నిర్లక్ష్యం, దుర్మార్గపు బాధ్యత, చట్టబద్ధమైన విధిని విస్మరించినందుకు గాను ఈ దావా వేస్తున్నట్టు ఆర్జీవీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.