RGV complained against producer Shekhar Raju
mictv telugu

నేను అతనికి ఎలాంటి డబ్బులు ఇచ్చేది లేదు.. పీఎస్‌లో ఆర్జీవీ

July 20, 2022

సంచలన, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బుధవారం పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చారు. అతను తీసిన ‘లడ్కీ’ సినిమా ప్రదర్శనను కోర్టు నిలిపివేయడంతో తనపై కేసు వేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేయడానికి ఆయన పోలీస్ స్టేషన్ గడప తొక్కారు. పుజా భలేకర్ నటించిన ఈ చిత్రం ఈ నెల 15న రిలీజవగా, మంచి టాక్‌తో స్థిరమైన కలెక్షన్లను రాబడుతోంది. ఈ క్రమంలో తనకు ఆర్జీవీ డబ్బు బాకీ ఉన్నాడని, ఆ డబ్బు ఇచ్చేంత వరకు సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని నిర్మాత కె. శేఖర్ రాజు హైదరాబాదు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ అంశంపై ఫిర్యాదు చేసిన ఆర్జీవీ అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘నా చిత్రంపై తప్పుడు సమాచారంతో కోర్టులో కేసు వేశారు. కోర్టును తప్పుదోవ పట్టించి చిత్ర ప్రదర్శనను నిలిపివేశారు. అందుకే ఫిర్యాదు చేయడానికి వచ్చా. నిర్మాత శేఖర్ రాజుకు నేను ఎలాంటి డబ్బు ఇవ్వాల్సింది లేదు. ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాను. సినిమాపై ఎంతోమంది ఆధారపడి జీవిస్తున్నారు. వారికి అన్యాయం చేయకూడదు’ అని వ్యాఖ్యానించారు. కాగా ఒక్క చైనాలోనే ఈ సినిమా రికార్డు స్థాయిలో విడుదలవడం గమనార్హం.