కోర్టుకెక్కిన దిశ నిందితుల కుటుంబాలు.. వర్మ చిత్రంపై..  - MicTv.in - Telugu News
mictv telugu

కోర్టుకెక్కిన దిశ నిందితుల కుటుంబాలు.. వర్మ చిత్రంపై.. 

November 2, 2020

judicial commission

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తీస్తున్న ‘దిశ’ చిత్రానికి మరో సమస్య ఎదురైంది. ఇప్పటికే ఈ చిత్రంపై దిశ కుటుంబం అభ్యంతరం చెప్పగా, తాజాగా దిశ హత్యాచార నిందితుల కుటుంబాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ కొడుకులను ఇందులో విలన్లుగా చూపుతున్నారని, ఈ చిత్రాలు అడ్డుకోవాలని సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. 

నలుగురి కుటుంబాలు హైకోర్టులోని సుప్రీం జ్యుడిషియల్ కమిటీ కార్యాలయానికి చేరుకుని ఫిర్యాదు అందజేశాయి. దిశ హత్యాచారం తర్వాత నిందితులైన జొళ్లు శివ, జొళ్లు నవీన్, చెన్నకేశవులు, ఆరీఫ్‌లను పోలీసులు ఎన్‌కౌంటర్ చెయ్యడం తెలిసిందే. దిశ సంఘటనపై సినిమా తీస్తున్న వర్మ అందులో నిందితులను క్రూరంగా చూపారని వారి కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. దీని కారణంగా తమకు సమాజంలో జీవించే స్వేచ్ఛ ఉండదని, ఆ సంఘటనతో సంబంధం లేని తమను ఈ చిత్రం నిందించేలా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తమ కుటుంబాల్లో పిల్లలపైనా ఈ చిత్రం తీవ్ర ప్రభావం పడుతుందని, ఎన్‌కౌంటర్ అయిన వాళ్లను వర్మ ఈ సినిమా పేరుతో మళ్లీ చంపుతున్నాడని పేర్కొంటున్నాయి. ఈ కేసులో ఇంకా దర్యాప్తు సాగుతోందని, అలాంటప్పుడు తమకు ఇష్టం వచ్చినట్లు ఎలా సినిమా తీస్తారని ప్రశ్నిస్తున్నాయి.