RGV.. Don't keep those words in mind: Vijayendraprasad
mictv telugu

ఆర్జీవీ.. అప్పుడన్న మాటల్ని మనసులో పెట్టుకోకు: విజేయంద్రప్రసాద్

July 14, 2022

“సుమారు పది నెలల క్రితం ‘కనబడుట లేదు’ అనే ఆడియో ఫంక్షన్‌కు నన్ను అతిథిగా పిలిచారు. అదే కార్యక్రమానికి రాంగోపాల్ వర్మ కూడా హాజరయ్యారు. దాదాపు 15 ఏళ్ల నుంచి వర్మపై నాలో గూడుకట్టుకున్న కోపం, చిరాకు, అసహ్యం, బాధ అన్నీ కలగలిపి ఆరోజు స్టేజ్‌పైనే ఆయన్ని కొన్ని మాటలు అన్నాను. “శివ’ సినిమా చూశా. ఎంతో స్ఫూర్తి పొందా. నేనే కాదు నాలాంటి వందల మంది రచయితలు, టెక్నీషియన్స్, డైరెక్టర్స్ మీ వల్ల ప్రేరణ పొంది ఈ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కానీ, ఆనాటి వర్మ కనిపించడం లేదు. మీకేమైనా కనిపిస్తే మళ్లీ అలాంటి సినిమా తీయమని చెప్పండి” అని ఆరోజు అన్నానని, ఆ మాటలు మనసులో పెట్టుకోవద్దని..ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఆర్జీవీని కోరారు.

రాం గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన ‘అమ్మాయి’ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ బుధవారం జరిగింది. ఈ ఈవెంట్‌కు విజయేంద్రప్రసాద్, ఎం.ఎం.కిరవాణీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ..”అలా ఆరోజు ఆ మాటలు అనొచ్చో లేదో కూడా నాకు తెలియదు. కానీ, నాలోని ఆ ఆవేశమే అలా అనిపించేలా చేసింది. కానీ, ఇప్పుడు ‘అమ్మాయి’ సినిమా ట్రైలర్ చూశాక గర్వంగా చెబుతున్నా. ‘రాము గారూ.. మీలో ఆనాటి డైరెక్టర్ మళ్లీ కనిపించారు. శివ కంటే వందింతలు ఎక్కువగా కనిపించారు. అమ్మాయి సినిమా 40వేల థియేటర్లలో విడుదలవుతోందంటే నిజంగానే అద్భుతమైన విషయం. ఈ ఘనత ఇప్పటి వరకూ ఎవరూ సాధించలేదు. మన తెలుగువారందరికీ ఇది గర్వకారణం” అని అయన అన్నారు.

దాంతో ఆర్జీవీ తెగ ఆనందపడిపోతూ, “మీరన్న మాటలు నా కెప్పటికీ గుర్తుంటాయి. ఇవే బెస్ట్ కాంప్లిమెంట్స్” అని అన్నారు. ఇక, ‘అమ్మాయి’ సినిమా విషయాకొస్తే.. మార్షల్ ఆర్ట్స్ చిత్రంగా ఆర్జీవీ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో పూజా భలేకర్ ప్రధాన పాత్రలో నటించింది. రేపు ఈ సినిమా దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతుంది.