RGV hot comments.. did not like 'KGF-2'
mictv telugu

ఆర్జీవీ హాట్ కామెంట్స్.. ‘కేజీఎఫ్-2’ నచ్చలేదు

September 5, 2022

టాలీవుడ్‌లో వివాదస్పద డైరెక్టర్‌గా పేరుగాంచిన రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ) ‘కేజీఎఫ్-2’ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కేజీఎఫ్-2′ విజయం బాలీవుడ్ వారిని విపరీతంగా భయపెట్టిందని, తాజాగా ఓ ఆంగ్ల ఎంటర్టైన్మెంట్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలను వెల్లడించారు.

”ఎందుకో తెలీదు కేజీఎఫ్-2’ సినిమా బాలీవుడ్‌లో చాలా మందికి నచ్చలేదు. బీటౌన్‌కు చెందిన ఓ బడా దర్శకుడు ఓసారి నాకు ఫోన్ చేసి..సినిమా అరగంట కూడా చూడకముందే బోర్‌గా అనిపించిందని చెప్పాడు. అదే సినిమాలోని ఓ సీన్ విషయంపై అతడికి, అతడి స్క్రిప్ట్ రైటర్‌కి మధ్య చిన్న చర్చ జరిగింది అని చెప్పాడు. వాళ్లకు నేను చెప్పేది ఒక్కటే.. ఆ సినిమా మీకు నచ్చినా, నచ్చకపోయినా అది సాధించిన విజయాన్ని ఎవరూ కాదనలేరు. నా దృష్టిలో ‘కేజీఎఫ్ – 2’ భిన్నమైన కథ. 1970ల్లో అమితాబ్ నటించిన సినిమాల జోన్‌కు సంబంధించిన కథ అది. వాస్తవికతకు దూరంగా అసహజమైన రీతిలో ప్రశాంత్ నీల్ దీన్ని రూపొందించారు. ఒక్కసారి ‘పెద్దమ్మ’ సీన్ గుర్తు చేసుకుంటే, రాఖీభాయ్ మెషిన్ గన్‌తో పేలిస్తే జీపులన్నీ గాల్లోకి ఎగురుతాయి. ఇలా, జీపులు గాల్లోకి లేవడం విడ్డూరంగా అనిపిస్తుంది. ఈ సినిమా నాకు నచ్చలేదని చెప్పను. ఇందులోని కొన్ని సీన్స్ చూసినప్పుడు మాత్రం నోరెళ్లబెట్టుకుని మరీ చూశా” అని ఆయన అన్నారు.

ఇక, కేజీఎఫ్-2 సినిమా విషయానికొస్తే.. కన్నడ స్టార్ హీరో యష్ కథనాయకుడుగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా, దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్-2ను తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో సంచలన క్రియేట్ చేసింది. బాలీవుడ్‌లోనే అత్యధికంగా కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా దాదాపు రూ.1250 కోట్లను వసూలు చేసింది. ఈ క్రమంలో కేజీఎఫ్-2 తర్వాత బాలీవుడ్‌లో చెప్పుకోదగ్గ సినిమా ‘కశ్మీర్ పైల్స్’ ఒకటి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.250 కోట్లు వసూలు చేసింది. కానీ, ఎన్నో విమర్శలకు గురైయ్యింది.