RGV Ladki movie collected Rs. 150 crores By advance bookings
mictv telugu

కలెక్షన్లతో దుమ్ము రేపిన ఆర్జీవీ ‘లడ్కీ’.. చైనాలో భారీ వసూళ్లు

July 17, 2022

ఆర్జీవీ సినిమాలంటే కాంట్రవర్సీ ఉంటుందని మనకు తెలుసు. దాంతోనే ఆయన తన సినిమాకు పెట్టిన పెట్టుబడిని రాబట్టుకుంటారన్నది జగమెరిగిన సత్యం. అయితే ఎంత కాంట్రవర్సీ ఉన్నా కొన్ని సినిమాలు అట్టర్ ప్లాఫ్ అయి నిర్మాతలను ముంచిన సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ, ఆర్జీవీ తాజాగా దర్శకత్వం వహించిన లడ్కీ(తెలుగులో అమ్మాయి) చిత్రం మాత్రం ఎలాంటి వివాదం లేకుండా ఈ నెల 15న విడుదలైంది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 47 వేల స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ముఖ్యంగా చైనాలో 40 శాతం అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. దీని ద్వారానే రూ. 150 కోట్ల రికార్డు స్థాయి ఆదాయం ఈ సినిమాకు వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మీడియాతో సమావేశం నిర్వహించారు. ముందుగా ఆర్జీవీ మాట్లాడుతూ ‘ఎంటర్ ది డ్రాగన్ సినిమా చూసి అలాంటి సినిమా తీయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. కానీ, అలాంటి అమ్మాయి మన దేశంలో నాకు దొరకలేదు. ఇన్నాళ్లకు పూజా భాలేకర్ దొరికింది. కొత్తదనంతో తీసిన ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. త్వరలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేస్తామ’ని వ్యాఖ్యానించారు. నిర్మాత టి. అంజయ్య మాట్లాడుతూ.. ‘ఇలాంటి సినిమాను తీసిన ఆర్జీవీకి థ్యాంక్స్. చాలా మంది దీనికి సీక్వెల్ తీయమని అడుగుతున్నారు. దానికి కూడా నిర్మాతగా అవకాశం ఇస్తారని భావిస్తున్నా. అన్నిచోట్లా పాజిటివ్ టాక్ వచ్చింది. ఏపీలో వంద థియేటర్లను పెంచబోతున్నాం. పూజా భలేకర్‌కు ఇప్పటికే అవకాశాలు వస్తున్నాయి. శివ తర్వాత ఆ స్థాయిలో హిట్ సాధించిన చిత్రంగా నేను భావిస్తున్నాను’ అని వెల్లడించారు.