బాలుకు ఆర్జీవి నివాళి.. తిట్లా? పొగడ్తలా?  - MicTv.in - Telugu News
mictv telugu

బాలుకు ఆర్జీవి నివాళి.. తిట్లా? పొగడ్తలా? 

September 25, 2020

RGV tribute to balu

భారతీయ సంగీత జగత్తులో తనదైన సంతకం చేసి వెళ్లిపోయారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. వేలాదిగా పాటలు పాడి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. కరోనా వైరస్ సోకి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మధ్యాహ్నం బాలు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో బాలూకు ఎందరో నివాళులు అర్పిస్తున్నారు. 

తాజాగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా తన ట్విటర్ వేదికగా నివాళి అర్పించారు. ‘ఇప్పుడు విషయం జీవించడం గురించి కాదు, కానీ అతను జీవించేటప్పుడు ఆ వ్యక్తి ఇతరుల జీవితాలకు ఎలా దోహదపడ్డాడనే దాని గురించి. ఎస్పీ బాలు భౌతిక ప్రయాణం  ముగిసింది, కానీ అతని స్వరం, సంగీతం జీవించినంత కాలం జీవిస్తుంది’ అని వర్మ ట్వీట్‌లో పేర్కొన్నాడు. వర్మ ట్వీట్‌కు చాలామంది అభిమానులు స్పందిస్తున్నారు. ఆర్జీవీ బాలూని తిట్టాడా? పొగిడాడా? అని కామెంట్లు చేస్తున్నారు. కాగా, రేపు ఎస్పీ బాలు అంత్యక్రియలు తమిళనాడులో జరగనున్నాయి. ఈ అంత్యక్రియలకు పలువురు తెలుగు ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. బాలు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో అక్కడి ప్రభుత్వం నిర్వహిస్తుంది అని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.