సుశాంత్ ఆత్మహత్య.. సారా, శ్రద్ధలకు ‘డ్రగ్’ నోటీసులు! - MicTv.in - Telugu News
mictv telugu

సుశాంత్ ఆత్మహత్య.. సారా, శ్రద్ధలకు ‘డ్రగ్’ నోటీసులు!

September 21, 2020

ngnf

బాలీవుడ్‌ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు డ్రగ్స్ మలుపు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో కొత్త కొత్త పేర్లు తెరమీదకు వస్తున్నాయి. తాజాగా యువ హీరోయిన్లు శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్ పేర్లు వినబడుతున్నాయి. విచారణకు హాజరు కావాల్సిందిగా వారిద్దరికీ ఈ వారంలో ఎన్‌సీబీ నోటీసులు జారీచేయనుందని సమాచారం. డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా బయటపడ్డ మాదకద్రవ్యాల సరఫరా అంశంలో ఇప్పటికే సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిని, ఆమె సోదరుడు షోవిక్ సహా పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లను రియా బయటపెట్టింది. వారిలో శ్రద్ధా, సారాల పేర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్‌సీబీ వారికి త్వరలోనే నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. 

కాగా, జూన్ 14న సుశాంత్‌ ముంబయిలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్ మరణానంతరం సోషల్ మీడియా వేదికగా అనేక అంశాలు తెరమీదకు వచ్చాయి. బాలీవుడ్ మాఫియా, నెపోటిజం, డ్రగ్స్ వంటివి బయటకు వచ్చాయి. నటి కంగనా రనౌత్ కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు రియా చక్రవర్తి తన కుమారుడిని మానసికంగా వేధించిందని, బ్యాంకు ఖాతా నుంచి కోట్లలో డబ్బు బదిలీ చేసుకుందని సుశాంత్ కుటుంబ సభ్యులు ఆమెపై కేసు వేశారు. రంగంలోకి దిగిన సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), ఎన్‌సీబీ దర్యాప్తు చేస్తున్నాయి. ప్రస్తుతం రియా ముంబయిలోని ఓ కారాగారంలో ఉంది.