రేప్ చేసి, చంపేస్తాం.. సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్‌కు బెదిరింపులు - MicTv.in - Telugu News
mictv telugu

రేప్ చేసి, చంపేస్తాం.. సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్‌కు బెదిరింపులు

July 31, 2020

Rhea Chakraborty Threatened to Frame Sushant Singh Rajput

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య మిస్టరీగా మారింది. ఈ కేసును ముంబై పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నాలో తన కొడుకు మరణంపై కేసు వేశారు. సుశాంత్ స్నేహితులు, గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిపై ఆయన అనుమానాలు వ్యక్తంచేశారు. మొదటినుంచి ఈ కేసులో రియా మీద చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. ముంబై పోలీసులు కూడా ఆమెను విచారించి వాంగ్మూలం తీసుకున్నారు. అయితే తనపై సుశాంత్ తండ్రి చేసిన ఆరోపణలను తిప్పి కొట్టేందుకు రియా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే పాట్నాలో కేకే సింగ్ దాఖలు చేసిన కేసును ముంబైకి బదిలీ చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుశాంత్ తండ్రి తనపై చేసిన ఆరోపణలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తనతో పాటు మరో ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని.. తాము ఆత్మహత్యకు ప్రేరేపించారనే అభియోగాన్ని మోపారని ఆమె సుప్రీంకోర్టుకు వెల్లడించారు. 

తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని.. సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని రియా తెలిపారు. తనకు సోషల్ మీడియాలో వేధింపులు తప్పడంలేదని చెప్పారు. రేప్ చేస్తాం, చంపేస్తాం అంటూ బెదిరిస్తున్నారని ఆమె వివరించారు. గత నెల బాంద్రాలోని తన నివాసంలో అతడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి తనకు వేధింపులు మొదలయ్యాయని వాపోయింది. సుశాంత్ మరణంతో కుంగిపోయిన తనను కొంత మంది బెదిరిస్తున్నారని ఆమె పేర్కొంది. ముంబైలోని శాంతాక్రజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో దీనిపై ఇప్పటికే తాను ఫిర్యాదు చేశానని స్పష్టంచేసింది. సుశాంత్‌ తండ్రికి బీహార్‌లో పలుకుబడి ఉందని, దీంతో కేసును ప్రభావితం చేస్తారని చెప్పింది. ఈ కేసును ముంబైకి బదిలీ చేయాలని కోరింది.