ఇంటర్నెట్ కోసం రోజూ 100 కి.మీ ప్రయాణం - MicTv.in - Telugu News
mictv telugu

ఇంటర్నెట్ కోసం రోజూ 100 కి.మీ ప్రయాణం

January 14, 2020

Internet.

సిట్యుయేషన్‌ను క్యాష్ చేసుకోవడం అంటే ఇదేనేమో. జమ్మూ కశ్మీర్‌లో బ్రాడ్‌బ్యాండ్, మొబైల్‌ నెట్‌ సర్వీసులను రద్దుచేసిన సుప్రీంకోర్టు.. మళ్లీ పునరుద్ధరించాలని ఆదేశించినా ప్రభుత్వం ఇంకా ఆ పని చేయలేదు. దీనిని అదనుగా భావించాయి కొన్ని ఇంటర్నెట్ కేఫ్‌లు. అడ్డంగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. పాపం అక్కడి పౌరులు కూడా కేవలం ఇంటర్నెట్ కోసం రోజూ 100 కిలోమీటర్ల దూరం వెళ్లి తమ పనులు చక్కదిద్దుకుంటున్నారు. దాదాపు వెయ్యిమంది కశ్మీరీలు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న బనిహాల్‌ పట్టణానికి రైల్లో వెళుతున్నారు. అక్కడ కేఫ్‌లలో ఇంటర్నెట్ లభిస్తుందని వెళ్తున్నారు. దీంతో ప్రతి రోజూ ఇక్కడి రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. కేవలం నాలుగువేల మంది జనాభా కలిగిన బనిహాల్‌ పట్టణంలో బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసు కలిగిన ఆరు ఇంటర్నెట్‌ కేఫ్‌లు నడుస్తున్నాయి. ఈ కేఫ్‌లు ఒక్కో వినియోగదారుడి నుంచి గంటకు రూ.300 వసూలు చేస్తూ పండగ చేసుకుంటున్నాయి.

ఈ కేఫ్‌లకు ఎక్కువగా విద్యార్థులు, నిరుద్యోగులు, ఆదాయం పన్ను శాఖ అధికారులు వస్తున్నారని కేఫ్‌ యజమానులు వెల్లడించారు. పరీక్షలకు సంబంధించిన మెటీరియల్‌ కోసం ఎక్కువగా ఇంటర్నెట్‌ కేఫ్‌లను ఆశ్రయించాల్సి వస్తోందని విద్యార్థులు చెబుతున్నారు. మరొక నిరుద్యోగి ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి వచ్చానని చెప్పారు. అయితే మరికొన్ని రోజుల్లో కశ్మీర్‌‌లో ఇంటర్నెట్‌ సర్వీసులను పునరుద్ధరించకపోతే తాను ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని కశ్మీర్‌ కొరియర్‌ సర్వీసులో పనిచేస్తున్న తౌసీఫ్‌ అహ్మద్‌ తెలిపారు. తమ కంపెనీలో ఇప్పటికే 50 మంది యువకులు ఉద్యోగాలు కోల్పోయారని వాపోయారు.

కాగా, కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను రద్దు చేసి, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ఆగస్టు 5వ తేదీ నుంచి ఇంటర్నెట్‌ సర్వీసులను రద్దు చేశారు. ఫలితంగా రాష్ట్రంలో ఐదు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని కశ్మీర్‌ పరిశ్రమల మండలి ఉపాధ్యక్షుడు అబ్దుల్‌ మజీద్‌ మీర్‌ పేర్కొన్నారు. ఇంటర్నెట్‌ సర్వీసుల రద్దు వల్ల వివిధ పరిశ్రమలకు ఇప్పటికే దాదాపు 250 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని వెల్లడించారు. పౌరుల ప్రాథమిక హక్కు అయిన ఇంటర్నెట్‌ సర్వీసులు 2016లోనే ఐక్యరాజ్య సమతి ప్రకటించింది. వారం రోజుల్లో కశ్మీర్‌లో ఈ సర్వీసులను పునురుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తున్న రాష్ట్ర అధికార యంత్రాంగం ఇప్పటికీ స్పందించకపోవడం విచారకరం అన్నారు.