ఒక ఉంగరంలో ఎన్ని వజ్రాలు పడతాయి. మహా అయితే నాలుగైదు వరకు పెట్టుకోవచ్చు. ఆ మాత్రం దానికే దాని ఖరీదు చాలా ఉంటుంది. అలాంటిది ఒకే ఉంగరంలో 26 వేల వజ్రాలు పొదిగారంటే ఆశ్చర్యంగా అనిపించదూ. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కి చెందిన డాజ్లింగ్ జ్యువెలరీ అనే ఆభరణాల తయారీ సంస్థ ఈ ఘనతను సాధించింది. పువ్వు ఆకారంలో రెండు వేళ్లకు ధరించగలిగే ఈ ఉంగరాన్ని 26 వేల 200 వజ్రాలతో తయారు చేసింది. ధగధగ మెరుస్తున్న ఆ ఉంగరానికి దేవ్ ముద్రిక అనే పేరు పెట్టకున్నట్టు సంస్థ యజమాని విపుల్ అగర్వాత్ తెలిపారు. ఇప్పటివరకు 24 వేల వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని ఓ సంస్థ తయారు చేసిందని, దానిని తాము అధిగమించినట్టు వెల్లడించారు. మొదట సాఫ్ట్ వేర్ ద్వారా దేవ్ ముద్రిక డిజైన్ రూపొందించి తర్వాత కళాకారులతో తయారు చేయించామని స్పష్టం చేశారు. పది మంది మూడు నెలల పాటు కష్టపడి ఉంగరాన్ని తయారు చేశారని, ఇంకా ధర నిర్ణయించలేదని వివరించారు. అటు గిన్నీస్ రికార్డులో చోటు కోసం దరఖాస్తు చేశామని, అది వచ్చాక ధర నిర్ణయిస్తామని పేర్కొన్నారు. అయితే ఇంత ధర పెట్టి ఉంగరాన్ని కొనే సామర్ధ్యం కేవలం దేశంలో అంబానీ, అదానీ వంటి సంపన్నుల వల్లనే సాధ్యమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.