Ripudaman Singh Malik, 1985 Air India bombing accused, shot dead in Canada
mictv telugu

35 ఏండ్ల కిత్రం కేసులో నిర్ధోషి.. సిక్కు నేత దారుణ హత్య

July 15, 2022

 

1985 ఎయిర్ఇండియా ఫ్లైట్ బాంబ్ దాడిలో ఆరోపణలు ఎదుర్కొని, ఆ కేసులో నిర్దోషిగా తేలిన ఓ సిక్కు నేత.. రిపుదమన్ సింగ్ మాలిక్ దారుణ హత్యకు గురయ్యారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా సర్రే ప్రాంతంలో ఆయన్ను కొందరు దుండగులు కాల్చిచంపారు. ఈ విషయాన్ని రిపుదమన్ సింగ్ కొడుకు జస్ప్రీత్ మాలిక్ ధ్రువీకరించారు. ఎయిర్ఇండియా బాంబు దాడిలో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిగా మా తండ్రిని ఎప్పడూ మీడియా సూచిస్తుందని.. తన తండ్రిపై జరిగిన దాడితో దానికి సంబంధం లేదని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 1985 ఎయిర్ ఇండియా బాంబు దాడి ఘటనలో నిర్దోషులుగా విడుదలైన ఇద్దరిలో రిపుదమన్ సింగ్ మాలిక్ ఒకరు.

మాలిక్‌ కెనడాలో ప్రముఖ వ్యక్తుల్లో ఒకరు. వాంకోవర్‌ కేంద్రంగా పనిచేసే ఖల్సా క్రెడిట్‌ యూనియన్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ యూనియన్‌లో 16వేల మంది సభ్యులున్నారు. దీంతో పాటు సర్రే, వాంకోవర్‌ ప్రాంతంలో పలు స్కూళ్లను నిర్వహిస్తున్నారు. ఇక ఎయిరిండియా పేలుళ్ల ఘటన విషయానికొస్తే.. జూన్ 23, 1985న మాంట్రియల్-లండన్-ఢిల్లీ-ముంబై మీదుగా వస్తున్న విమానం.. సూట్ కేసులో అమర్చిన ఓ బాంబు వల్ల తునాతునకలైంది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తోన్న అందరూ మృతిచెందారు.

ఈ దాడి చేసి కూల్చివేసిన ఘటనలో మాలిక్ తో పాటు అజైబ్ సింగ్ బగ్రీ అనే మరో వ్యక్తి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే వీరిద్దరిని మార్చి 2005న కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 మాంట్రియల్ నుంచి లండన్ మార్గంలో 31 వేల ఫీట్ల ఎత్తులో ప్రయాణిస్తుండగా ఐర్లాండ్ తీరంలో అట్లాంటిక్ మహాసముద్రంలో కూల్చివేయబడింది. ఈ ఘటనలో మొత్తం 331 మంది చనిపోయారు.