రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. పంత్ ఆరోగ్యం రెండు రోజుల్లో బాగా మెరుగుపడిందని వైద్యులు చెబుతున్నారు. ఈ మేరకు అతడిని ఐసీయూ నుంచి ప్రైవేట్ వార్డుకు మార్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగానే ఉండంతో డెహ్రాడూన్ ఆస్పత్రిలోని ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరో ఆస్ప్రత్రికి మార్చే అవసరం లేదని చెప్పారు. అయితే కాలికి సంబంధించిన గాయం కోసం విదేశాలకు తరలించాలని బీసీసీఐ భావిస్తోంది.
పంత్ ప్రమాదానికి గురైన సమయంలో సాయం అందించిన ఇద్దరు యువకులు తాజాగా ఆస్పత్రిలో పంత్‌ని పరామర్శించారు. పంత్ పోగొట్టుకున్న వస్తువులను కుటుంబ సభ్యులకు అందించారు. వారిని పంత్ అభింనదించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో బెడ్‌పై ఉన్న పంత్ చేయి కనిపిస్తోంది. పంత్ ముఖం కనిపింనప్పటికీ ఫ్యాన్స్ ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు.
డిసెంబర్ 30వ తేది తెల్లవారుజామును పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి తన మెర్సిడెస్ బెంజ్ కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. రూర్కీ సమీపంలో రోడ్డు డివైడర్‌ను పంత్ కారు బలంగా ఢీ కొట్టింది. ఈ సమయంలో కారులో మంటలు చెలరేగాయి. వెంటనే కారు అద్దాలను పగులగొట్టి, పంత్ బయటపడి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. పంత్ తల, వీపుకు దెబ్బలు తగిలాయి. కాలికి కూడా తీవ్ర గాయమైంది. తిరిగి పంత్ మైదానంలో అడుగుపెట్టేందుకు సుమారు 6 నెలల సమయం పట్టే అవకాశం ఉంది.