భారత క్రికెట్ జట్టు సభ్యుడు రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి పెను గురయ్యాడు. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌కు తిరిగి వస్తుండగా.. హమ్మద్‌పూర్ ఝల్ సమీపంలో అతని కారు డివైడర్‌ను ఢీకొట్టి మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో పంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తల, కాలుతో పాటు పంత్ వీపుపై బలమైన గాయాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రమాద సమయంలో బిఎమ్‌డబ్ల్యూ కారు పంతే డ్రైవింగ్ చేసినట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగిన వెంటనే పంత్ కారు నుంచి బయటకు దూకేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మొదట స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించి అనంతరం ఢిల్లీకి వైద్యులు రిఫర్ చేశారు. శుక్రవారం ఉదయం 5:15 గంటలకు ప్రమాదం జరిగింది.
రిషబ్ కారు మొదట రెయిలింగ్‌ను ఢీకొట్టింది, ఆ తర్వాత కారులో మంటలు చెలరేగాయి. వెంటనే కారు నుంచి పంత్ బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. అతి కష్టం మీద చివరికి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాద దృశ్యాలు భయానకంగా కనిపిస్తున్నాయి.
జనవరి మొదటి వారంలో జరగనున్న శ్రీలంక సిరీస్‌కు బీసీసీఐ ఎంపిక చేసిన జట్టులో పంత్ కు చోటు దక్కలేదు. ODI, t20లోనూ పంత్ స్థానం కోల్పోయాడు. నిన్న( డిసెంబర్ 29), పంత్ ఒక వీడియోను పోస్ట్ చేసాడు. అతను వీడియోకు “మై సిల్లీ పాయింట్ ఆఫ్ ది డే” అని పేరు పెట్టాడు. వీడియోలో, అతను పక్షులకు ఆహారం ఇస్తున్నట్లు కనిపించాడు.