Rishabh Pant Makes Young Fan's Day, Replies to Kid on His Birthday -
mictv telugu

బాధలోనూ గొప్ప మనస్సు..తన బుల్లి ఫ్యాన్ కోరిక తీర్చిన పంత్

February 28, 2023

Rishabh Pant Makes Young Fan's Day, Replies to Kid on His Birthday

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్ క్రమంగా కోలుకుంటున్నాడు. ఇప్పుడిప్పుడే నడవడం కూడా ప్రారంభించాడు. త్వరగా కోలుకోవడానికి పంత్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. పంత్ ఆరోగ్యం కుదుటపడుతున్నా..మైదానంలో దిగేందుకు మరింత సమయం పట్టనుంది. ఇదే విషయాన్ని భారత్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా వెల్లడించాడు. పంత్ తిరిగి ఆటనే ప్రారంభించేందుకు ఏడాది లేదా రెండేళ్లు సమయం పట్టొచ్చని తెలిపాడు.

ప్రమాదంతో ఆటకు దూరమై తీవ్ర మనస్థాపంలో ఉన్న సమయంలో కూడా పంత్ తన గొప్ప మనస్సును చాటుకున్నాడు. ఆరేళ్ల అభిమాని కోరిక తీర్చాడు. సువాజిత్ ముస్తాఫీ అనే వ్యక్తి పంత్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశాడు. దానితో పాటు చిన్న రిక్వెస్ట్ చేశాడు.

‘హే రిషభ్ పంత్, నీ రికవరీ ప్రాసెస్ అంతా స్మూత్‌గా సాగుతోందని ఆశిస్తున్నా. మా అబ్బాయి అయాన్ నీకు చాలా పెద్ద ఫ్యాన్.డిసెంబర్ 30 నుంచి నువ్వు కోలుకోవాలని ప్రార్థిస్తున్నాడు. ఈ రోజు తన 6వ బర్త్‌డే. కొంచెం తనకు బర్త్‌డే విషెస్ చెప్పగలవా? ప్లీజ్’ అని ట్వీట్ చేశాడు. దానికి అయాన్ లెఫ్ట్ హ్యాండ్ షాట్ కొట్టి.. ‘నేను పంత్‌లా ఆడతా’ అంటున్న వీడియోను కూడా జత చేశాడు.

ఈ ట్వీట్‌కు రిషబ్ పంత్ స్పందించాడు. ‘హ్యాపీ బర్త్‌డే అయాన్. ఈ ఏడాది నీకు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా’ అని రిప్లై చేశాడు. దీంతో తండ్రి సువాజిత్‌తో పాటు అయాన్ ఆనందంలో మునిగిపోయారు. అభిమాని కోరిక చిన్నదే అయినే దానికి స్పందించిన పంత్ పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.