రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఢిల్లీ, డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం (డీడీసీఏ) అధికారులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పంత్‌ను నిన్న డీడీసీఏ అధికారులు పరామర్శించారు. ఈ క్రమంలో తాజాగా పంత్ ఆరోగ్యంపై డీడీసీఏ డైరెక్టర్ శ్యామ్ శర్మ మాట్లాడుతూ.. పంత్ ఆరోగ్యం మెరుగవుతోందని చెప్పారు. యాక్సిండెంట్ జరిగినప్పుడు ఎడమ కంటి కనుబొమ్మ వద్ద గాయం కాగా.. దానికి ప్లాస్టిక్ సర్జరీ చేశారని, ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా నిన్న సాయంత్రం అతడిని ప్రైవేటు వార్డుకు మార్చారని చెప్పారు. పూర్తిగా కోలుకునే వరకు డెహ్రడూన్ అసుపత్రిలోనే ట్రీట్మెంట్ కొనసాగుతుందన్నారు. కాలి లెగ్మెంట్ చికిత్స కోసం విదేశాలకు తరలించే అంశంపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
పంత్‌కు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉన్నందున అతడిని పరామర్శించేందుకు ఎవరూ ఆసుపత్రికి వెళ్లొద్దని శర్మ విజ్ఞప్తి చేశారు. పంత్‌ను పరామర్శించేందుకు హాస్పిటల్‌కు పెద్ద సంఖ్యలో విజిటర్లు వస్తున్నారని, దీని వల్ల అతనికి రెస్ట్ దొరకడం లేదన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అధికారులు, సినీ యాక్టర్లు ఇలా ఒకరి తర్వాత మరొకరు.. విజిటింగ్ అవర్స్‌తో సంబంధం లేకుండా హాస్పిటల్‌కు వస్తుండడంతో పంత్ కు విశ్రాంతి కరువైందన్నారు. అతడి కుటుంబ సభ్యులు సైతం దీని వల్ల ఇబ్బంది పడుతున్నారని.. కాబట్టి అందరూ అర్ధం చేసుకోవాలన్ని విన్నవించారు.