పంత్‌..ఏంటా కీపింగ్‌?..రోహిత్‌ శర్మ అసంతృప్తి - MicTv.in - Telugu News
mictv telugu

పంత్‌..ఏంటా కీపింగ్‌?..రోహిత్‌ శర్మ అసంతృప్తి

November 4, 2019

ఆదివారం రోజున ఢిల్లీ వేదికగా బాంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో వికెట్‌ కీపర్‌‌గా రిషభ్‌ పంత్‌ మరొకసారి విఫలయ్యాడు. ముఖ్యంగా డీఆర్‌ఎస్‌ల విషయంలో చురుగ్గా ఉండే ధోని స్థానాన్ని పంత్‌ భర్తీ చేయలేడనే విషయం మరోసారి రుజువైంది. దీనిపై టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసాడు. బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా స్పిన్నర్ చహల్‌ వేసిన 10వ ఓవర్‌లో సౌమ్య సర్కార్‌ క్రీజులో ఉన్నాడు. చహల్‌ వేసిన బంతి సౌమ్య బ్యాట్‌కు తాకీతాకనట్టు వెళ్లి నేరుగా పంత్‌ చేతుల్లో పడింది. 

టీమిండియా ఆటగాళ్లు అందరూ అప్పీల్ చేసినా.. అంపైర్‌ ఔట్ ఇవ్వలేదు. డీఆర్ఎస్‌కు కోరదామా అని రోహిత్‌ శర్మ చహల్‌ను అడగ్గా స్పష్టంగా చెప్పలేను అని సమాధానం ఇచ్చాడు. కీపర్ పంత్‌ను అడగ్గా.. కచ్చితంగా బ్యాట్‌కు బంతి తగిలిందని చెప్పి రోహిత్‌ను ఒప్పించి డీఆర్‌ఎస్‌ కోరాడు. సమీక్షలో సౌమ్య బ్యాట్‌కు బాల్ తగలలేదని స్పష్టంగా తేలడంతో టీమిండియా డీఆర్‌ఎస్‌ వృథా అయ్యింది. దీంతో ‘పంత్‌.. నీ కీపింగ్‌ ఏంది.. నువ్వు ఏంది’ అని అర్థం వచ్చేలా రోహిత్‌ శర్మ తలపట్టుకున్నాడు. దీనిపై పంత్‌ ఏదో చెప్పబోయే ప్రయత్నం చేసినా డీఆర్‌ఎస్‌ వృథా కావడం మాత్రం రోహిత్‌లో అసంతృప్తిని బయటపెట్టింది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. తరువాత బంగ్లాదేశ్‌ 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 154 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.