పెద్దోడివే బుద్ధుందా.. దానికి ఆయుధ పూజ ఏంటి..  - MicTv.in - Telugu News
mictv telugu

పెద్దోడివే బుద్ధుందా.. దానికి ఆయుధ పూజ ఏంటి.. 

October 9, 2019

ఓ హోదాలో వున్నవాళ్లు కాస్త కొన్ని విషయాలలో ఆచితూచి మాట్లాడాలి. కొన్ని సందర్భాలలో చాలా హుందాగా వ్యవహరించాల్సి వస్తుంది. లేదంటే ఇప్పుడున్న సోషల్ మీడియా స్వేచ్ఛతో నెటిజన్లు ఒక ఆట ఆడేసుకుంటారు. అతను సెలెబ్రిటీయా లేకపోతే రాజకీయ నేతా అన్న విషయలేవీ పట్టించుకోరు. పంచులతో అతలాకుతలం చేస్తారు. అదే జరిగింది బాలీవుడ్ సీనియర్ నటుడు రిషికపూర్ విషయంలో. దసరా పండగ సందర్భంగా ఆయన బాటిల్ ఓపెనర్ ఫోటో పోస్ట్ చేస్తూ.. తన ఆయుధ పూజ దీనికే అని స్టేటస్ పెట్టారు. దీంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని చాలా మంది ఆయనపై కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. 

దసరా పండుగకు ఎంత విశిష్ఠత వుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పండగను దేశం యావత్తు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శుభాకాంక్షలు చెప్పకపోయినా ఫర్వాలేదు కానీ ఇతరుల మనోభావాలు దెబ్బతీసే వ్యాఖ్యలు చేయకూడదు. కానీ రిషికపూర్ ఇదే పని చేశారు. మహర్నవమి రోజున ఆయుధ పూజలు చేయడం మన హిందువుల సంప్రదాయం. ఆరోజు వాహనాలకు లేకపోతే ఇంట్లోని ముఖ్యమైన వస్తువులకు ఆయుధ పూజలు చేస్తుంటారు. అయితే రిషి కపూర్ మాత్రం బాటిల్ ఓపెనర్‌కు ఆయుధ పూజ చేశారట. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘నా ఆయుధం ఇదే. దీనికే నా పూజ. దీనిని సరైన సందర్భంలో వాడాలి’ అని పేర్కొంటూ బాటిల్ ఓపెనర్ ఫోటోను కూడా పోస్ట్ చేశారు. 

ఆయన పోస్టుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ సీనియర్ నటుడు అయివుండి పండుగ రోజున ఇలాంటి మెసేజ్‌లు చేయడం ఏమీ బాలేదని.. మీలాంటివాళ్ల నుంచి ఇలాంటి పోస్టులు వస్తాయని ఊహించలేదని అసహనం వ్యక్తంచేస్తున్నారు. సరదాకు కూడా ఇలాంటి పోస్టులు పెట్టకండి.. సినిమాల్లో పంచులు వేసినట్టు సోషల్ మీడియాలో కూడా పండగలను చులకన చేసి మాట్లాడవద్దని చెబుతున్నారు. ఆయుధానికి పరికరానికి తేడా తెలీదా అని మరొక యూజర్ మండిపడ్డాడు. మీరు ఓ సీనియర్ నటుడు. ప్రజలకు మంచి విషయాలు చెప్పకపోయినా ఫర్వాలేదు కానీ ఇలాంటి పిచ్చి మెసేజ్‌లు మాత్రం చెప్పొద్దు అని మరొకరు గడ్డిపెట్టారు.

అయితే రిషి కపూర్ ఈ కామెంట్స్‌ను పట్టించుకోలేదు. తన పోస్టును కూడా తొలగించలేదు.   అలా చేసినందుకు కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. రిషి ఇలాంటి ట్వీట్లు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ సమయం సందర్భం లేకుండా పోస్టులు పెట్టి నెటిజన్ల చేత చివాట్లు తిన్నారు. కాగా, గతేడాది క్యాన్సర్ బారిన పడిన రిషి కపూర్ చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. దాదాపు 11 నెలల పాటు అక్కడే ఉన్నారు. ఇటీవల చికిత్స పూర్తవడంతో ముంబయి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఏ సినిమాకూ సంతకం చేయలేదు.